మోదీ చిత్రపటాన్ని చీపుళ్లతో కొట్టి నిరసన.. కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌

Telangana: MLA Jagga Reddy Lashes Out PM Narendra Modi - Sakshi

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కౌంటర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల మంటలు మండుతూనే ఉన్నాయి. రాహుల్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ బీజేపీ నేతలు మహారాష్ట్రలో నిరసన వ్యక్తం చేయగా, రాహుల్‌ గాంధీకి మద్దతుగా తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు మోదీ చిత్రపటాన్ని చెప్పులు, చీపుర్లతో కొడుతూ కౌంటర్‌ ఇచ్చారు.

ఆదివారం గాంధీభవన్‌లో సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి నేతృత్వంలో జరిగిన ఆందోళనలో ఈ మేరకు ప్రతి నిరసన చేపట్టారు. గాంధీభవన్‌ వెలుపలికి వచ్చేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆ తర్వాత గాంధీభవన్‌ ప్రాంగణంలోనే కాంగ్రెస్‌ నేతలు చీపుర్లు, చెప్పులతో మోదీ చిత్రపటాన్ని కొడుతూ రాహుల్‌కి మద్దతుగా, సావర్కర్, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఉన్నది అంటే ఉలుకెందుకు: జగ్గారెడ్డి 
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం హిందూ, ముస్లింలు కలిసి పనిచేశారనీ కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సావర్కర్‌ మాత్రం బ్రిటిష్‌ పాలకులను క్షమాభిక్ష కోరాడని ఆరోపించారు. ఉన్నది అంటే ఉలుకు ఎందుకని పశ్న్రించారు.  కార్యక్రమంలో యూత్‌కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఫిషర్‌మెన్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top