తెలంగాణకు పెద్దపీట

Telangana: Four Seats In The BJP New National Executive - Sakshi

బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో నలుగురికి చోటు 

కిషన్‌రెడ్డి, జితేందర్‌ రెడ్డి, వివేక్‌ , గరికపాటికి స్థానం  

ప్రత్యేక ఆహ్వానితులుగా ఈటల, విజయశాంతి 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి కన్నా లక్ష్మీనారాయణ 

ప్రధాని మోదీ సహా 80 మందికి సభ్యులుగా అవకాశం 

సాక్షి , హైదరాబాద్‌/ న్యూఢిల్లీ:  బీజేపీ జాతీయ కార్యవర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణకు పార్టీ నాయకత్వం పెద్ద పీట వేసింది. రాష్ట్రం నుంచి నలుగురు సభ్యులకు అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్‌ రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావులకు జాతీయ కార్యవర్గంలో స్థానం లభించింది. ఈటల రాజేందర్, విజయశాంతిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కన్నా లక్ష్మీ నారాయణకు చోటు కల్పించారు. 

కొత్త మంత్రులకు చోటు
రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని గురువారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నడ్డా నియమించిన కమిటీలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, గోయల్, అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి సహా 80 మంది సభ్యులు ఉన్నారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన అశ్విని వైష్ణవ్, మన్సుఖ్‌ మాండవీయ, జ్యోతిరాదిత్య సింథియా, మీనాక్షి లేఖిలను కమిటీలోకి తీసుకున్నారు. 

మేనక, వరుణ్‌లకు దక్కని స్థానం 
లఖీమ్‌పూర్‌ ఘటనలో రైతులకు న్యాయం జరగాలని, కారకులకు శిక్ష పడాలంటూ సంబంధిత వీడియోను ట్వీట్‌చేసిన పార్టీ ఎంపీ వరుణ్‌ గాంధీకి కొత్త కమిటీలో చోటు దక్కలేదు. మోదీ సర్కార్‌ విధానాలపై విమర్శలు చేసిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్‌ సింగ్‌లతో పాటు వ్యవసాయ చట్టాల్లో రైతు అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎంపీ మేనకాగాంధీలను కమిటీ నుంచి తప్పించారు.

కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 35 మంది పార్టీ పదాధికారులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులకూ చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, జాతీయ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top