‘వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యమేస్తోంది’

TDP Supporter Of Vice Sarpanch Humiliate Dalit Leader In Chandragiri - Sakshi

రైతు చైతన్యయాత్రలో దళిత నేతపై టీడీపీ మద్దతుదారుడైన ఉపసర్పంచ్‌ వ్యాఖ్యలు

దళితులను వేదికపై కూర్చోబెడతారా?

మరోసారి ఇలా జరిగితే ఆర్బీకే సెంటర్‌కు తాళాలు వేస్తా

అవమానంతో కన్నీటి పర్యంతమైన దళిత నేత

చంద్రగిరి: దళితుడిని మాతో పాటు సమానంగా వేదికపై ఎలా కూర్చోబెడతారు? వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యం వేస్తుంది.. మరోసారి ఇలా జరిగితే రైతుభరోసా కేంద్రానికి తాళాలు వేస్తానంటూ తెలుగుదేశం మద్దతుదారుడైన ఓ ఉపసర్పంచ్‌ తన కులపిచ్చిని ఇలా బహిరంగంగా వ్యక్తపరిచిన ఘటన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత పంచాయతీలో శుక్రవారం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రైతు చైతన్యయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా బి.కొంగరవారిపల్లి, భీమవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్థానిక సర్పంచ్‌ లక్ష్మీ, సింగిల్‌ విండో డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, బాధితుడు దళిత నేత, ఎంపీటీసీ అభ్యర్థి రాజయ్యలతో పాటు అధికారులు పాల్గొన్నారు. స్థానిక ఉప సర్పంచ్‌ రాకేష్‌చౌదరి కార్యక్రమం వద్దకు వచ్చి, హాజరుకాకుండా వెనుదిరిగారు. కార్యక్రమం అంతా సజావుగా సాగి, అధికారులు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో రాకేష్‌చౌదరి వేదిక వద్దకు వచ్చి.. మీరు అధికారులేనా.. ఎవరిని వేదికపైకి కూర్చోబెట్టాలో.. పెట్టకూడదో కూడా తెలియదా?.. ఒక దళితుడిని వేదికపై ఎలా కూర్చోబెడతారంటూ అధికారులపై జులుం ప్రదర్శించాడు. వారి పక్కన మాలాంటి వారు (అగ్రకులాల) కూర్చోవాలంటేనే అసహ్యంగా ఉందంటూ ఆయన ప్రవర్తించిన తీరు అక్కడి అధికారులతో పాటు స్థానిక ప్రజలను విస్మయానికి గురిచేసింది.

మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంటే సహించేదిలేదని, రైతుభరోసా కేంద్రానికి తాళాలు వేస్తానంటూ అధికారులను హెచ్చరించారు. అనంతరం బాధితుడు రాజయ్య కలుగజేసుకుని దళితులను ఇలా అవమానించి మాట్లాడటం సరికాదని రాకేష్‌చౌదరికి హితవు పలికారు. అగ్రవర్ణాలతో పాటు దళితులు కూడా ఓటు వేస్తేనే మీరు ఉపసర్పంచ్‌ అయ్యారని, దళిత జాతిని కించపర్చి మాట్లాడటం సబబు కాదని తెలిపారు. దళితుడైన నేను వేదికపై కూర్చోకూడదని రాజ్యాంగంలో ఉందా అని ఆయన్ను ప్రశ్నించారు.

దళితులంటే ముందు నుంచి చిన్నచూపు చూస్తున్నారంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. మరోసారి రాజయ్యపై ఉపసర్పంచ్‌ అసభ్యకరంగా మాట్లాడటంతో ఆయన తీవ్ర కలత చెందారు. అగ్రకులానికి చెందిన రాకేష్‌చౌదరి వ్యాఖ్యలతో దళిత నేతలు, కుల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.  పోలీసులకు ఫిర్యాదు దళితజాతిని కించపరిచేలా మాట్లాడిన రాకేష్‌చౌదరిపై రాజయ్యతో పాటు దళిత సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top