Tamilnadu: వారంలో స్థానిక నగారా..?

Tamil Nadu: DMK AIADMK BJP Prepared For Local Polls 9 New Districts - Sakshi

కసరత్తు వేగవంతం 

జిల్లా నేతలతో అళగిరి భేటీ

సాక్షి, చెన్నై: వారం రోజుల్లో స్థానిక నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. దీంతో వివిధ పార్టీలు కసరత్తులు వేగవంతంగా చేస్తున్నాయి. ఇక, జిల్లాల నేతలతో సోమవారం టీఎన్‌సీసీ అధ్యక్షు డు కేఎస్‌ అళగిరి సమావేశమయ్యారు. తమిళనాడులో కొత్తగా ఆవిర్భవించిన తిరునల్వేలి, తెన్‌కాశి, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, వేలూరు, తిరుపత్తూరు, రాణి పేట జిల్లాల్లో స్థానిక నగారా వాయిదా పడి ఉన్న విషయం తెలిసిందే.

వీటిలో సెప్టెంబరు చివరిలోపు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలు ఈ జిల్లాల్లో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టాయి. ఇక ఇప్పటికే ఆయా జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించి, కార్యక్రమాలు విస్తృతం చేశాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ సైతం ఎన్నికల పనుల మీద దృష్టి సారించింది. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌ ఈ జిల్లాల్లో తమకు బలం అధికంగా ఉన్న స్థానిక సంస్థల మీద గురిపెట్టింది.

మరోవైపు... సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయా జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతల నుంచి వివరాల్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి రాబట్టారు. ఆ మేరకు డీఎంకే నుంచి ఆ స్థానిక సంస్థల్ని ఆశించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ పక్షాల కసరత్తులు ఓ వైపు ఉంటే, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పళనికుమార్‌ ఏర్పాట్లలో వేగం పెంచారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో దీన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి.  

చదవండి: Tamil Nadu: మాట తప్పం..!  గుబులు వద్దు.. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top