గుంటూరు జిల్లాలో టీడీపీకి ఝలక్

Shock To TDP In Guntur district - Sakshi

దుగ్గిరాలలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఇద్దరు ఎంపీటీసీ అభ్యర్థులు

సీఎం జగన్‌ సంక్షేమ పథకాలే ఆకర్షించాయన్న నేతలు

పరిషత్‌ ఎన్నికల్లోనూ మున్సిపల్‌ ఫలితాలే : ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మరో షాక్‌ తగిలింది. త్వరలో జరగనున్న పరిషత్‌ ఎన్నికల ముందు అక్కడ ఎంపీటీసీ–1, ఎంపీటీసీ–03 స్థానాలకు టీడీపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు ఆ పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సమక్షంలో మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఎంపీటీసీ–01 స్థానానికి పోటీచేస్తున్న దరివేముల హనీరాయ్, ఎంపీటీసీ–03 అభ్యర్థిగా పోటీచేస్తున్న బాణావత్‌ ఉమాదేవి, దుగ్గిరాల సర్పంచ్‌ బాణావత్‌ కుషీబాయ్‌తో పాటు పలువురు నాయకులు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో టీడీపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేసినప్పటికీ అక్కడ వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు 1,100 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో డీలాపడ్డ ఆ పార్టీ నేతలకు ఎంపీటీసీ అభ్యర్థులు మరో షాక్‌ ఇవ్వడంతో ఎంపీటీసీ ఎన్నికల్లోగా ఇంకెంతమంది జంప్‌ అవుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. 

సీఎం సంక్షేమ పథకాలు ఆకట్టుకున్నాయి
కాగా, వైఎస్సార్‌సీపీలో చేరిన హనీరాయ్, ఉమాదేవి మాట్లాడుతూ.. తమకు తొలి నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఇష్టమని.. కానీ, స్థానిక టీడీపీ నేతల మాటలు నమ్మి ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్‌ వేశామన్నారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను ఆకట్టుకున్నాయన్నారు. తమపై ఎలాంటి ఒత్తిడిలేదని వారు స్పష్టంచేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయన్నారు. సంక్షేమ పథకాలే తమ పార్టీని విజయపథంలో నడిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top