ఆర్‌జేడీలో ఎల్‌జేడీ విలీనం

Sharad Yadav led Loktantrik Janata Dal merges with Lalu RJD - Sakshi

ప్రతిపక్షాల ఐక్యత కోసమేనన్న శరద్‌ యాదవ్‌

న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ (74) తన నేతృత్వంలోని లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ (ఎల్‌జేడీ)ను రాష్ట్రీయ జనతాదళ్‌లో విలీనం చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల్లో ఐక్యత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఆయన తెలిపారు. బీజేపీని దీటుగా ఎదుర్కోగల సత్తా ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉందన్నారు. 1997లో దాణా కుంభకోణం బయటపడ్డాక జనతాదళ్‌లో విభేదాల నేపథ్యంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆర్‌జేడీని స్థాపించారు.

అప్పట్లో జనతాదళ్‌లో లాలూకు గట్టి పోటీ ఇచ్చే నేతగా శరద్‌ యాదవ్‌ ఉండేవారు. 2005లో ఆర్‌జేడీ పాలనకు చరమగీతం పాడేందుకు శరద్‌ యాదవ్, నితీశ్‌కుమార్‌ ఏకమయ్యారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ–ఆర్‌జేడీ అలయెన్స్‌ ఏర్పాటులో శరద్‌యాదవ్‌ కీలకంగా వ్యవహరించారు. తర్వాత శరద్‌ యాదవ్‌ వేరు కుంపటి పెట్టుకున్నాక ఎల్‌జేడీ పెద్దగా ఎదగలేకపోయింది. అనారోగ్యం తదితర కారణాల వల్ల పార్టీ శ్రేణులకు మరో ప్రత్యామ్నాయం చూపేందుకే ఆయన విలీనం వైపు అడుగులు వేసినట్లు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top