అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

Sambit Patra Raised Questions On Rahul Gandhi - Sakshi

ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ సమాధానం

న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల ఎవరూ చనిపోలేదని కోర్టుల్లో చెప్పాయని, కానీ ఇప్పుడు దానిపై రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శించారు. బుధవారం ఆయన ప్రతిపక్ష పార్టీల తీరు గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల ఏ ఒక్కరూ చనిపోలేదని రాష్ట్రాలు కోర్టులకు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చాయని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చిన సమాచారాన్నే కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లు ఈ విషయంపై రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఒకానొక పెద్ద పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన రాహుల్‌.. ట్విట్టర్‌లో రెండు లైన్ల అబద్ధాలను ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో అలాంటి వ్యాఖ్యలు చేయడం కంటే వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలతో మాట్లాడితే మంచిదని సూచించారు. ఢిల్లీ, మహారాష్ట్రలు తమ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందక మరణించారని ఆరోపణలు వచ్చిన కేసులపై అలాంటిదేమీ జరగలేదని ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టుల్లో చెప్పాయన్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఏ ఒక్కరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో మంగళవారం వెల్లడించింది.

అందుకే మరణాలు: ప్రియాంక
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్‌ లేమి కారణంగా ఎవరూ చనిపోలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి మొదలైన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం భారీగా ఆక్సిజన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసిందని, దీంతో ఆక్సిజన్‌ లేమి ఏర్పడిందని అన్నారు. అంతేగాక ఆక్సిజన్‌ను తరలించేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేయలేదని.. ఈ కారణాల వల్లే సెకండ్‌ వేవ్‌లో మరణాలు సంభవించాయని ఆమె చెప్పారు. ఈ ఏడాది కరోనా సమయంలో ఆక్సిజన్‌ ఎగుమతిని కేంద్రం ఏకంగా 700 శాతం పెంచిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను నిర్మించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. సెకెండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ అందక పలువురు మరణించారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా చెప్పారు. ఆయా మరణాలను గుర్తించేందుకు తమ ప్రభుత్వం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top