జగన్‌కు ప్రజలిచ్చిన ఆశీర్వాదం ఈ గెలుపు 

Sajjala Ramakrishna Reddy Comments On YSRCP Victory In AP Municipal Elections 2021 - Sakshi

నమ్మకం, విలువలకే పట్టం కట్టారు 

టీడీపీకి వెంటిలేటర్‌ కూడా పీకేశారు 

కృత్రిమ ఉద్యమాలు చేస్తే ఇదే గతి 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పెరిగిన జీవన ప్రమాణాలకు కృతజ్ఞతగానే జనం వైఎస్‌ జగన్‌కు మద్దతిస్తున్నారని చెప్పారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. 

పెరిగిన నమ్మకం 
పాదయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల నుంచే మేనిఫెస్టో తయారు చేశారు. యువ నాయకుడిపై నమ్మకం ఉందని, ఆకాంక్షలు నెరవేరుస్తున్నాడనే విశ్వాసం ప్రకటించారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపేలా ఆయన చేపట్టిన చర్యలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. పాలనను ప్రజల ముంగిట్లోకే తీసుకెళ్లారు. రైతులకు పూర్తి భరోసా వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయి. అందుకే ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో సానుకూల తీర్పు వచ్చింది.  

కృత్రిమ ఉద్యమాలకు కాలం చెల్లు 
చంద్రబాబు పదవి నుంచి దిగిపోతూ రాష్ట్రంపై రూ. 2 లక్షల కోట్ల అప్పు మోపారు. కోవిడ్‌ కష్టకాలం వల్ల రాష్ట్రం ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నా వైఎస్‌ జగన్‌ ప్రజా సంక్షేమం విషయంలో వెనుకడుగు వేయలేదు. నిబ్బరంగా అడుగులు ముందుకేశారు. ఈ రెండేళ్లుగా చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవడానికే పనిచేశారు. చౌకబారు రాజకీయాలు చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసమే పనిచేశారు. నిర్మాణాత్మక పాత్ర పోషించారు. చంద్రబాబు మాత్రం లేని సమస్యలు సృష్టించారు. తాను నమ్ముకున్న మీడియాపైనే ఆధారపడ్డారు. ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ వైపు అడుగులేస్తే.. అమరావతి భ్రమను చూపించి ఉద్యమం అన్నారు. కృత్రిమ ఉద్యమాలు చేస్తే ప్రజలు సహించరని రుజువైంది. ప్రజల పట్ల అసభ్యంగా మాట్లాడిన టీడీపీకి వెంటిలేటర్‌ కూడా జనం పీకేశారు. తమ రోషం ఏంటో చూపించిన జనం చంద్రబాబును ఛీకొట్టారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో కూర్చున్నారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించినా.. ఎన్ని సమస్యలు సృష్టించినా.. ప్రజలు జగన్‌ ప్రభుత్వాన్నే కోరుకోవడం శుభపరిణామం. ఈ విజయంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలంటే టీడీపీ భయపడుతోంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top