మండలిలో టీడీపీ సైంధవ పాత్ర సాగదు

Sajjala Ramakrishna Reddy Comments On TDP - Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని అడ్డుకోవడంలో తెలుగుదేశం పార్టీ శాసన మండలిలో నిర్వహించిన సైంధవ పాత్ర ఇకపై సాగదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 2019 ప్రజా కోర్టులో తిరస్కరణకు గురైన టీడీపీ కక్షతో, కుట్రలతో మండలిలో వారికున్న సాంకేతిక బలాన్ని అడ్డుపెట్టుకుని పాలనను అడుగడుగునా ఆటంకపరిచిందని తెలిపారు. కోర్టులకెక్కి కుట్రలు చేశారని అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు వేశారు. అసెంబ్లీ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన సభలో 152 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో తమ అభ్యర్థుల గెలుపు లాంఛనమేనన్నారు. దీనికి తోడు స్థానిక సంస్థల్లో 80 శాతం మంది తమ సభ్యులే ఉన్నారని, 11 ఎమ్మెల్సీ స్థానాల (స్థానిక సంస్థల)ను కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.

వచ్చే నెల నుంచి మండలిలో వైఎస్సార్‌ సీపీ సభ్యుల సంఖ్య 32కు పెరుగుతుందని సజ్జల చెప్పారు. ఇన్నాళ్లూ అపరిపక్వత, అసంబద్ధతతో టీడీపీ ఆడిన ఆటలకు తెరపడిందన్నారు. జనరంజక పాలనలో తనకు భాగస్వామ్యం కల్పించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి పాలవలస విక్రాంత్‌ అన్నారు. రాజకీయాల్లో విలువలు కనుమరుగైపోతున్న తరుణంలో సీఎం జగన్‌ విలువలు, విశ్వసనీయతకు ప్రాణం పోస్తున్నారని కొనియాడారు. మరో ఎమ్మెల్సీ అభ్యర్థి ఇషాక్‌ బాషా మాట్లాడుతూ టీడీపీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని మండిపడ్డారు. నంద్యాల ఉపపోరులో మైనార్టీల కష్టాలను కళ్లారా చూసిన జగన్‌ అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం తమకు మండలిలో అవకాశం కల్పించారన్నారు. రెండోసారి మండలికి ఎంపిక చేసి మరోసారి ప్రజాజీవితానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి డీసీ గోవిందరెడ్డి అన్నారు.  

జగన్‌ సామాజిక న్యాయం 
తాజాగా ఎన్నిక కాబోయే సభ్యులతో కలిపి మండలిలో 32 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులకు గాను 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండటం సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయానికి అద్దంపడుతోందని తెలిపారు. మండలిలో నలుగురు మైనార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో కూడా లేదన్నారు. నంద్యాల ఉప పోరులో ఇచ్చిన హామీ ప్రకారం జగన్‌ మైనార్టీలకు న్యాయం చేశారన్నారు. 2014–19లో 30 మంది టీడీపీ ఎమ్మెల్సీలు ఉంటే అందులో  11 మంది మాత్రమే వెనుకబడిన వర్గాలవారున్నారని తెలిపారు. ఓట్ల కోసమే అసెంబ్లీ ఎన్నికలకు  ముందు ఓ మైనార్టీకి ఎమ్మెల్సీగా టీడీపీ అవకాశం ఇచ్చిందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top