ఎన్నికలకు ఏమాత్రం భయపడం: సజ్జల

Sajjala Ramakrishna Reddy Comments On Panchayat Elections - Sakshi

విజయదుందుభి మోగిస్తాం

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం 

అవాంఛనీయ పరిణామం జరిగితే దానికి ఎస్‌ఈసీదే బాధ్యత 

వ్యాక్సినేషన్‌పై కేంద్రంతో చర్చిస్తాం 

భేషజాలకు వెళ్లే ప్రభుత్వం కాదిది 

పంచాయతీ ఎన్నికల వెనుక కుయుక్తులున్నాయి 

ఎన్నికలు మాకేం కొత్త కాదు 

చంద్రబాబు మాదిరి పారిపోయే ప్రసక్తే లేదు 

ప్రభుత్వ సలహాదారు సజ్జల

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, పంచాయతీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యానే ఎన్నికలు వాయిదా వేయాలని కోరామన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. వైఎస్సార్‌సీపీకి ఎన్నికలు కొత్తకాదని, పంచాయతీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తుందని తెలిపారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వంతో సమాలోచనలు చేస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..  

ప్రజారోగ్యం కోసమే వాయిదా కోరాం 
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైందని, ఈ సమయంలో ఎన్నికలు కష్టమని, ప్రజారోగ్యం దృష్ట్యా వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఈ కారణంగానే న్యాయస్థానానికి వెళ్లాం. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం. ఇంత వరకు ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు ప్రభుత్వం బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది. పంచాయతీ ఎన్నికలు అనివార్యమని తేలడంతో వ్యాక్సినేషన్‌పై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే పోలీసులు అటు వ్యాక్సినేషన్, ఇటు ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలి. వైద్య ఆరోగ్య సిబ్బందిదీ ఇదే పరిస్థితి. ఉద్యోగులూ ఆందోళనలో ఉన్నారు.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మొదటిదశ వ్యాక్సినేషన్‌ తీసుకున్న వాళ్లు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఇవన్నీ పక్కనబెట్టి ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉందని కేంద్రానికి వివరిస్తాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తాం. కేంద్రం సలహా తీసుకుంటాం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికలు కొత్తేమీ కాదు. బలమైన పునాదులుండి, ప్రజల్లో మమేకమైన పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబునాయుడు తరహాలో మేమెప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడం. సగంలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పక్కనబెట్టి పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం వెనుక కుయుక్తులున్నాయన్నదే మా అనుమానం.

క్షేత్రస్థాయిలో జరిగే ఈ ఎన్నికలకు బూత్‌లు ఎక్కువ ఉంటాయి. సిబ్బంది ఎక్కువగా కావాలి. గుంపులుగా చేరే అవకాశం ఉంటుంది. కోవిడ్‌ సమయంలో ఇవన్నీ ఇబ్బంది కలిగించే అంశాలు. ఇవన్నీ తెలిసి కూడా పంచాయతీ ఎన్నికలను ముందుకు తేవడం వెనుక దురుద్దేశాలున్నాయనేది మా అనుమానం. ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా ఎన్నికల కమిషనరే బాధ్యత వహించాలి. పల్లెల్లో వివాదాలు లేకుండా, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. అలాంటిది దీన్ని అడ్డుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. వ్యవస్థలను భ్రషు్టపట్టించడం చంద్రబాబుకు అలవాటు. ఇప్పుడు కూడా ఆయన పాత్రపోషిస్తున్నాడు. కోర్టు తీర్పును ప్రజా విజయం అని టీడీపీ చెప్పుకొంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. రాజ్యాంగం ఓ వ్యక్తికి ఇచ్చిన అధికారాలను అడ్డుపెట్టుకుని తెరవెనుక రాజకీయం చేసే చంద్రబాబు ఇలాంటి మాటలే మాట్లాడతాడు. చేతనైతే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి చూపించాలి. ప్రజల కోసం న్యాయస్థానం మెట్లు తొక్కిన మేం.. ఓడిపోయినా దాన్ని ఉన్నతంగా స్వాగతిస్తాం. 

ఎన్నికలు వద్దని సీఎస్‌ అనలేదు 
సీఎస్‌ ఎన్నికలు వద్దనలేదు. సుప్రీంకోర్టులో ఉంది కదా.. రెండు రోజులు ఆపండి అని మాత్రమే ఎస్‌ఈసీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత... సీఎస్‌తో ఎస్‌ఈసీ చర్చించి ఎన్నికలకు సంబంధించిన తదుపరి కార్యాచరణను ఖరారు చేయాల్సింది. కానీ అందుకు భిన్నంగా ఏకపక్ష, దుందుడుకు నిర్ణయాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ముందుకెళ్తున్నారు. రీషెడ్యూల్‌ ప్రకటించేశారు. ఏర్పాట్లపై సీఎస్‌తో చర్చించకుండా కేంద్రబలగాలు కోరడం ఆక్షేపణీయమే. ఇందులోనే ఆయన విపరీత మనస్తత్వం తెలుస్తోంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఉద్యోగులు వాళ్ల సమస్యలే తెరమీదకు తెస్తున్నారు. దాన్ని గుర్తించకుండా తనకు వ్యతిరేకమని ఆయన భావించడం దారుణం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top