డ్రగ్స్‌ వ్యాపారంలో బాబు, లోకేశ్‌!

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Nara Lokesh - Sakshi

లోకేశ్‌ ఇప్పుడు దుబాయ్‌లో ఏం చేస్తున్నట్లు?

చంద్రబాబు తరచూ రహస్యంగా మారిషస్‌కు ఎందుకు వెళ్తున్నారు?

డ్రగ్స్‌ దందాలో తమ పేర్లు బయటపడతాయనే దొంగే దొంగా దొంగా అన్నట్లు చంద్రబాబు అరుస్తున్నారు

ప్రపంచంలో ఎక్కడ, ఏం జరిగినా సీఎం జగన్‌కు ముడిపెడుతూ దుష్ఫ్రచారం చేస్తారా?

టీడీపీ–ఓ వర్గం మీడియా కట్టుకథలపై పరువు నష్టంతోపాటు న్యాయపరమైన చర్యలు చేపడతాం

‘పాండోరా పత్రాల్లో జగన్‌ పేరు ఉండే ఉంటుంది’ అని ఎవరైనా హెడ్డింగ్‌ పెట్టి రాస్తారా?

అందులో ఈనాడు రామోజీ పేరు ఉండొచ్చు అని మేమంటే మీకు మండదా?

అలీషాతో బాబుకే సంబంధాలు ఉన్నట్లు ఇదిగో ఫొటో సాక్ష్యం

నాడు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తుంటే ‘ప్యారడైజ్‌ లీక్స్‌’ అంటూ దుష్ప్రచారం

వాటిపై జగన్‌ సవాల్‌ విసిరితే చంద్రబాబు పరార్‌

పనామా లీక్స్‌లో ఆఖరికి దొరికింది హెరిటేజ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టరే

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌

సాక్షి, అమరావతి: దోచుకున్న  ప్రజాధనంతో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి, టీడీపీని కబ్జా చేసిన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌తోపాటు వారి కుటుంబం, ఆయన చుట్టూ ఉన్న మంద డ్రగ్స్‌ వ్యాపారంలోకి దిగిందేమోనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. అఫ్గానిస్తాన్‌ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న రూ.20 వేల కోట్లకుపై విలువచేసే హెరాయిన్‌ను కేంద్ర నిఘా సంస్థలు పట్టుకుంటే లోకేశ్‌ ఇప్పుడు దుబాయ్‌లో ఎందుకున్నారని.. ఆయన అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే, చంద్రబాబు ఎందుకు తరచూ రహస్యంగా మారిషస్‌ వెళ్తున్నారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయంగా మనుగడ ప్రశ్నార్థకమవడంతో 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు దోచేసిన సొమ్మును చంద్రబాబు డ్రగ్స్‌ వ్యాపారంలోకి మళ్లించారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు చుట్టూ స్మగ్లర్లే ఉంటారని.. వారితో కలిసి డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. వారు భారీ ఎత్తున దిగుమతి చేసుకున్న హెరాయిన్‌ గుజరాత్‌లో పట్టుబడడంతో దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు.. బాబు, ఆయనకు బాకా ఊదే ఓ వర్గం మీడియా ద్వారా సీఎం జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు, లోకేశ్, వారి అనుచరుల కదలికలు కూడా అలానే ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా డీఆర్‌ఐతో విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని కోరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► టీడీపీ, ఓ వర్గం మీడియా అబద్ధాల పైత్యం పరాకాష్టకు చేరింది. నిరాధారమైన కథనాలను ప్రచారం చేస్తున్నారు. చూస్తూ ఊరుకోలేకపోతున్నాం.
► ఎక్కడో గుజరాత్‌లో హెరాయిన్‌ పట్టుబడితే.. దానిని ఆంధ్రప్రదేశ్‌కు ముడిపెట్టి.. రాష్ట్రం హెరాయిన్‌కు అడ్డాగా మారిపోయిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ కేసుపై కేంద్రం దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ అదానీ పేరుతో ఎవరైనా పట్టుబడి ఉంటే.. అదానీ అంటే రాక్షసుడన్నట్లుగా సృష్టించేవారేమో. 
► బాబు, లోకేశ్‌లు హైదరాబాద్‌లో కూర్చుని విజయసాయిరెడ్డి, వైఎస్‌ అనిల్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి డ్రగ్స్‌తో సంబంధం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపై పరువు నష్టం దావా వేసి న్యాయపోరాటం చేస్తాం.

గంజాయి దందాలో వాటాలు తీసుకున్నారా?
గంజాయికి ఏపీ అడ్డాగా మారిందని టీడీపీ విమర్శలు చేయడం చూస్తే.. నవ్వాలో ఏడవాలో తెలీడంలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటుచేసి.. గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సాగును అడ్డుకునేందుకు ఆదేశాలివ్వబట్టే దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏడాదిన్నరలోనే 2.50 లక్షల కేజీల గంజాయిని సీజ్‌ చేశారు. దీని రవాణా ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోంది. తన హయాంలో చంద్రబాబు నిద్రపోయారా? లేక గంజాయి దందాలో వాటాలు తీసుకున్నారా?

‘ఈనాడు’ను న్యూస్‌ పేపర్‌ అనాలా?
► ‘ఈనాడు’లో మంగళవారం మొదటి పేజీలో ‘పాండోరా పత్రాల్లో జగన్‌ పేరు ఉండే ఉంటుంది’ అనే హెడ్డింగ్‌తో ఒక వార్త ప్రచురించారు. ఎవడైనా మనిషి అనేవాడు ఇలాంటి హెడ్డింగ్‌ పెడతాడా? ఎవడో ఏదో కూత కూస్తే దాన్ని అలాగే తాటికాయంత అక్షరాలతో అచ్చు వేస్తారా? ఏమీ చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారా? వీటిని చదివి ప్రజలు ఏమనుకుంటారు? ఈనాడును న్యూస్‌ పేపర్‌ అనాలా? 

అలీషా–బాబు బంధానికి ఇదిగో సాక్ష్యం..
► అలీషా ఎక్స్‌పోర్టుకు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి హెరాయిన్‌ కేసులో సంబంధం ఉందంటూ పచ్చ పత్రికల్లో, వారి సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటి గురించి ఆరా తీస్తే.. అలీషా అనే వ్యక్తి  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గంటా శ్రీనివాస్‌రావుతో కలిసి వెళ్లి ఫొటోలు దిగారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. 
► జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తుంటే.. ప్యారడైజ్‌ లీక్స్‌లో జగన్‌ అని దుష్ప్రచారం చేశారు. వాటిపై జగన్‌ సవాల్‌ విసిరితే బాబు పారిపోయాడు. 
► ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రైస్‌ ఎక్స్‌పోర్టు బిజినెస్‌ను పట్టుకుని అలీషా, సుధాకర్‌ అంటూ ఏవేవో పేర్లు తీసుకువచ్చి హెరాయిన్‌తో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. గతంలోనూ వికీలీక్స్, ప్యారడైజ్, పనామా పేపర్లతోనూ ఇలాగే ఊదరగొట్టారు. కానీ, పనామా కేసులో చివరికి దొరికింది హెరిటేజ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టరే. దీనిపై బాబు సమాధానం చెప్పడు.
చంద్రబాబు, గంటా శ్రీనివాసరావులతో అలీషా (ఫైల్‌) 

ఇలా రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్న చంద్రబాబు అండ్‌ కో ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై చట్టపరంగా పోరాటం చేస్తాం. దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top