పైలట్‌ తొందరపడ్డారా!? 

Sachin Pilot Back To Jaipur - Sakshi

బలం అంచనా వేయలేకపోయారా

బీజేపీ అంచనా తప్పిందా

‘మధ్యప్రదేశ్‌’ ఎందుకు రిపీట్‌ కాలేదు 

న్యూఢిల్లీ/జైపూర్‌: రాజస్తాన్‌ డ్రామా సుఖాంతమైంది. కాంగ్రెస్‌లోని వైరి పక్షాల మధ్య ఈ సయోధ్య తాత్కాలికమేనని.. ఇప్పుడు కాకపోతే మరి కొన్నాళ్లకైనా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం కుప్పకూలడం తథ్యమని బీజేపీ చెబుతోంది. బీజేపీ అంచనాల వెనుక ‘లెక్క’లేమిటో స్పష్టంగా తెలియదు. కానీ రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘విఫల’యత్నం చేసిందనేది అందరూ నమ్ముతున్న విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కురువృద్ధుడు గహ్లోత్‌పై  తిరుగుబాటు చేసిన యువనేత సచిన్‌ పైలట్‌ వెనుక ‘కాషాయ’ ధీమా ఉందనే అంతా విశ్వసిస్తున్నారు. అయితే, మధ్యప్రదేశ్‌ తరహాలో రాజస్తాన్‌లోనూ కాంగ్రెస్‌ సర్కారు కూల్చివేత సాధ్యం కాకపోవడం వెనుక పలు కారణాలను విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా స్పష్టమైన ప్రణాళికతో, బీజేపీ నుంచి స్పష్టమైన హామీతో ముందుకు వెళ్లారు. అక్కడ నంబర్‌ గేమ్‌లోనూ బీజేపీకి అడ్వాంటేజ్‌ ఉంది. 20 మందికి పైగా సింధియా అనుకూల ఎమ్మెల్యేల రాజీనామాలతో.. అరకొర మెజారిటీతో నెట్టుకొస్తున్న కమల్‌నాథ్‌కు రాజీనామా తప్ప మార్గం లేకపోయింది. 230 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీలో అప్పుడున్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 227(ఇద్దరు చనిపోయారు. ఒకరు సస్పెండ్‌ అయ్యారు). కాంగ్రెస్‌ బలం ఆరుగురు మిత్రపక్ష ఎమ్మెల్యేలతో కలిపి 120(114+6). బీజేపీ బలం 107. మెజారిటీ మార్క్‌ 114. 21 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 93కి పడిపోయింది. మొత్తం సభ్యుల సంఖ్య 206కి తగ్గింది. దాంతో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 104కి చేరింది. దాంతో, బీజేపీ తన 107 మంది ఎమ్మెల్యేలతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

రాజస్తాన్‌లో ఆ అంచనా తప్పింది. 30కి పైగా ఎమ్మెల్యేలు తనవైపు వస్తారని పైలట్‌ ఆశించారు.  వాస్తవానికి ఆయన వెంట నడిచింది 18 మందే. అంటే తనతో కలిపి 19 మంది. అసెంబ్లీలో 13 మంది వరకు స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. వారిని సైతం ఆయన తనవైపు ఆకర్షించలేకపోయారు. మరోవైపు, ఈ సంక్షోభాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీనియర్‌ నేత గహ్లోత్‌  మెజారిటీ ఎమ్మెల్యేలు ‘చే’జారకుండా చూసుకున్నారు. కేంద్రమంత్రి షెకావత్, తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ, మధ్యవర్తి సంజయ్‌ జైన్‌ల గొంతులతో ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఆడియో టేపులపై  దుమారం లేపారు. పోలీసు కేసులతో హడలెత్తించారు.

ఈ కుట్ర వెనుక బీజేపీ ఉందని, ఎమ్మెల్యేలను సీబీఐ, ఈడీ, ఐటీల ద్వారా బెదిరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తూ, బీజేపీని డిఫెన్స్‌లో నెట్టారు. ఏ ఒక్క ఎమ్మెల్యే చేజారకుండా, అందరినీ జైపూర్‌ శివార్లలోని రిసార్ట్‌కు తరలించి,  నెలపాటు అక్కడే ఉంచారు.  ప్రభుత్వాన్ని కాపాడుకుంటానని అధిష్టానానికి హామీ ఇచ్చి మద్దతు సంపాదించారు. పైలట్‌కు అగ్ర నాయకత్వం నుంచి ఎలాంటి సహకారం అందకుండా చూశారు. పాలుపోని స్థితిలో పైలట్‌ సొంతగూటికి వచ్చే పరిస్థితి కల్పించారు. రాహుల్, ప్రియాంకలతో ఉన్న సాన్నిహిత్యం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వెనుక పైలట్‌ కృషిని గుర్తించిన అగ్ర నాయకత్వం కూడా ఆయనను కోల్పోవాలనుకోలేదు.

అందుకే, పైలట్‌పై పరుష వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నాయకత్వం ఆదేశించింది. అయినప్పటికీ, ఆగ్రహం అణచుకోలేని గహ్లోత్‌ దద్దమ్మ అంటూ పైలట్‌ను దూషించారు.  కాగా, 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 107. ఇండిపెండెంట్లు, మిత్ర పక్షాలు కలుపుకుని ఆ సంఖ్య 124కు చేరుతుంది. బీజేపీ బలం 72. మిత్రపక్షాలతో కలిసి 76. పైలట్‌ నేతృత్వంలోని 19 మందిని  స్పీకర్‌ అనర్హులుగా ప్రకటిస్తే.. ఎమ్మెల్యేల సంఖ్య 181 అవుతుంది. మెజారిటీ మార్క్‌ 92కు తగ్గుతుంది. ఈ నంబర్‌కు చేరుకోవడం బీజేపీకీ కష్టమే. తిరుగుబాటు ఎమ్మెల్యేలను మినహాయిస్తే కాంగ్రెస్‌ బలం 88 అవుతుంది. మిత్రపక్షాలు, స్వతంత్రుల దన్నుతో గహ్లోత్‌ సునాయాసంగా విశ్వాస పరీక్ష నెగ్గగలరు.  

కక్ష సాధింపు రాజకీయాలు ఉండరాదు: సచిన్‌ పైలట్‌
కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం తగదని  సచిన్‌ పైలట్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానంతో సయోధ్య అనంతరం దాదాపు నెల రోజుల తర్వాత పైలట్‌ మంగళవారం జైపూర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ పదవి కోసం కూడా అధిష్టానాన్ని డిమాండ్‌ చేయలేదు. రాజకీయాల్లో వ్యక్తిగత విభేదాలకు తావులేదు. కక్ష సాధింపు రాజకీయాలు ఉండరాదు’అని వ్యాఖ్యానించారు.

తాను ఎన్నడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదనీ, అధిష్టానంతో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లానన్నారు. తనకు వ్యతిరేకంగా వస్తున్న ప్రకటనలు విచారకరమంటూ ఆయన.. ఆ వ్యాఖ్యలు బాధించాయనీ,  ఇటువంటి వాటిపై మాట్లాడలేననీ, రెండు తప్పులు కలిస్తే ఒప్పుగా మారవు కదా అని వ్యాఖ్యానించారు. ‘నాతోపాటు ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలు  ప్రధానంగా రాష్ట్రంలో నాయకత్వానికి సంబంధించిన సమస్య, ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకు, పాలన సరిగ్గా లేకపోవడానికి సంబంధించిన సమస్యలను అధిష్టానానికి వివరించా’అని తెలిపారు.

రాజీ ఫార్ములా వివరాలు నాకు తెలియవు: గహ్లోత్‌ 
కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తిరుగుబాటు వర్గం నేత సచిన్‌ పైలట్‌ మధ్య కుదిరిన సయోధ్యపై రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు. ఆ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎందుకు చేశారో, వారికిప్పుడు హైకమాండ్‌ ఎలాంటి హామీ ఇచ్చిందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. దాదాపు నెల రోజులపాటు కొనసాగిన సంక్షోభానికి కారణమైన సచిన్‌ పైలట్‌తో అధిష్టానానికి కుదిరిన రాజీ ఫార్ములా వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు. పైలట్‌కు ఏవైనా సమస్యలుంటే అధిష్టానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి చెప్పుకోవచ్చన్నారు.

ఏదేమైనా, గతంలో మాదిరిగానే ఎమ్మెల్యేల ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం జైసల్మీర్‌ వెళ్లే ముందు సీఎం గహ్లోత్‌ మీడియాతో మాట్లాడారు. ‘నా వల్ల ఎమ్మెల్యేలెవరైనా ఇబ్బంది పడితే పరిష్కరించడం నా బాధ్యత. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వారి సమస్యలను తీరుస్తా’అని తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top