నయా ట్విస్ట్‌.. మణిపూర్‌ సీఎం రేసులో ఆరెస్సెస్‌ అభ్యర్థి! వర్గపోరుకు చెక్‌ పెట్టడానికే బీజేపీ స్కెచ్‌

RSS Backed Leader BJP Option For Manipur CM Candidate - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్‌ఇంకా కొనసాగుతూనే వస్తోంది. బీరెన్‌ సింగ్‌ నేతృత్వంలోనే పార్టీ ఘన విజయం సాధించడంతో ఆయన్నే మరో దఫా సీఎంగా కొనసాగించాలని కొందరు బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే వర్గ పోరు గనుక చెలరేగితే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం గల్లంతు అవ్వొచ్చనే ఆందోళన నెలకొంది బీజేపీలో..  

బీజేపీ మాత్రం సీఎం క్యాండిడేట్‌ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్‌ నడిపిస్తోంది. బీరెన్‌ సింగ్‌తో పాటు సీఎం పోస్టుకు బిస్వాజిత్‌ సింగ్‌ పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మూడో పేరు ముఖ్యమంత్రి రేసులో తెరపైకి వచ్చింది. ఆరెస్సెస్‌ బలపరుస్తున్న యుమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ పేరు ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరింది. ఈ మేరకు ఖేమ్‌చంద్‌కు ఢిల్లీకి నుంచి శనివారం పిలుపు సైతం అందించింది.

బీరెన్‌, బిస్వాజిత్‌ మధ్య పోటీని నివారించేందుకే మూడో అభ్యర్థి పేరును తెర మీదకు తీసుకొచ్చింది బీజేపీ. అంతేకాదు ఖేమ్‌చంద్‌కు ఆరెస్సెస్‌ మద్దతు ఇప్పుడు మణిపూర్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. నిన్నంతా బీరెన్‌, బిస్వాజిత్‌, ఖేమ్‌చంద్‌లతో విడివిడిగా బీజేపీ కీలక నేతలు సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం వాళ్లంతా తిరిగి మణిపూర్‌కు చేరుకోగా.. ఆ వెంటనే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, కిరెన్‌ రిజ్జులు రాజధాని ఇంఫాల్‌కు క్యూ కట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు కాబోయే సీఎం ఎవరనేదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. 

నిజానికి బిస్వాజిత్‌ సింగ్‌, బీరెన్‌ సింగ్‌ కంటే సీనియర్‌. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. 2017లోనే ఆయన సీఎం అవుతారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. మొత్తం 60 సీట్లున్న మణిపూర్‌ అసెంబ్లీలో బీజేపీ తాజా ఎన్నికల్లో 32 సీట్లు గెల్చుకుని సుస్థిర ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధమైంది. ఈ తరుణంలో వర్గ పోరు పరిస్థితిని మార్చేయొచ్చన్న ఆందోళనలో అధిష్టానం ఉంది. అయితే తామంతా ఒకే తాటిపై ఉన్నామంటూ బిస్వాజిత్‌ సింగ్‌ ప్రకటన ఇవ్వడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. మణిపూర్‌ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతోనే ముగియగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బీరెన్‌ సింగ్‌ కొనసాగుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top