
పాలమూరుకు ఏమీ చేయని బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఓట్లు ఎందుకు వేయాలి
బోయలకు న్యాయం చేస్తాం.. కేసీఆర్‌లాగా మాట ఇచ్చి మోసం చేయం: సీఎం రేవంత్‌రెడ్డి
గాంధీభవన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా వాల్మీకిబోయ పెద్దలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 స్థానాలకుగాను 12 చోట్ల గెలిచాం. గద్వాలలో కూడా కాంగ్రెస్ కచ్చితంగా గెలిచేది. కానీ చివర్లో బీజేపీ అరుణమ్మ అల్లుడికి ఓట్లు వేయించింది. అక్కడ దొంగదెబ్బ తీశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారు. దొంగలంతా ఒక్కటై నన్ను రాజకీయంగా బలహీనపర్చాలని చూస్తున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు లోక్‌సభ అభ్యర్థులు వంశీ, మల్లురవిల మీద కోపం లేదు.
ఉన్నదంతా నా మీదనే. నన్ను దెబ్బతీస్తే సొంత జిల్లాలో గెలవలేని వ్యక్తి రాష్ట్రమంతా ఏం చేస్తాడని ప్రశ్నించవచ్చనేది వారి ఆలోచన’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరుకు ఏమీ చేయని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఏం మొహం పెట్టుకొని ఓట్లడుగుతారని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న డీకే అరుణ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించిన రేవంత్ పదేళ్లలో పాలమూరుకు ఏమీ చేయని మోదీ ఇప్పుడేం చేస్తారని..ఇప్పుడు ఓటేస్తే్త మోదీ చంద్రమండలానికి రాజవుతాడా అని వ్యాఖ్యానించారు.
శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో ఆయన మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వాల్మీకిబోయ సామాజికవర్గ పెద్దలతో సమావేశ మయ్యారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటకలో బోయలకు రిజ్వరేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే
‘వాల్మీకిబోయలపై కాంగ్రెస్‌కు అభిమానం ఉంది. కర్ణాటకలో బోయలకు రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణలో ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత వాల్మీకిబోయల డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటాం. సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడి మీ సమస్యలు ఎలా తీర్చాలో చెప్పండి. మీ సమస్యలపై మాకు అవగాహన ఉంది. వాటిని తీర్చే బాధ్యత నాది. ఎన్నికల తర్వాత నేనే మీతో మళ్లీ సమావేశమవుతా. మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వండి. మేం కచ్చితంగా బోయలకు న్యాయం చేస్తాం. కేసీఆర్‌లాగా మాట ఇచ్చి మోసం చేయం. వంద రోజుల పాలనలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఆరు గ్యారంటీలను అమలు చేశాం. అధికారంలోకి 100 రోజుల్లో విశ్వాసం కల్పించాం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
కేటీఆర్ ఫలితం అనుభవిస్తారు
‘కొంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు. చేస్తే ఏమవుతుందని కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. తప్పుడు పనులు చేసిన అధికారులు ఇప్పుడు చిప్పకూడు తినాల్సి వస్తోంది. వాళ్లు దుర్మార్గులు, వాళ్ల మాటలు వినొద్దంటే ఆ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేటీఆర్ ఆంబోతులా బరితెగించి మాట్లాడుతున్నా డు. ఫలితం అనుభవిస్తాడు. ట్యాపింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మంది సంసారాల్లో తొంగి చూడడానికి వీళ్లకేం పని. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారు. గతంలో ఫోన్ మాట్లాడాలంటేనే భయంగా ఉండేది. ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టే కొడంగల్‌కు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశా. అక్కడ కూడా కచ్చితంగా గెలవబోతున్నాం. 200 ఓట్లతో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.