రాజస్తాన్‌ డ్రామాకు తెర

Rajasthan Assembly To Start From August 14 - Sakshi

ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్‌ ఓకే

సీఎం గహ్లోత్‌ పంపిన నాలుగో ప్రతిపాదనకు అంగీకారం

గవర్నర్‌తో సీఎం గహ్లోత్, స్పీకర్‌ సీపీ జోషి వేర్వేరుగా భేటీ

జైపూర్‌: రాజస్తాన్‌ రాజకీయ డ్రామాకు ప్రస్తుతానికి తెర పడింది. ఆగస్ట్‌ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా అంగీకరించారు. దాంతో గవర్నర్, కాంగ్రెస్‌ సర్కార్‌ల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. అంతకుముందు, బుధవారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి.

జులై 31 నుంచి అసెంబ్లీని ప్రారంభించాలని కోరుతూ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కేబినెట్‌ గవర్నర్‌కు పంపిన మూడో సిఫారసును గవర్నర్‌ వెనక్కు పంపించారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో తను కోరిన వివరణలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని, అసెంబ్లీ భేటీలను ప్రారంభించడానికి సహేతుక కారణం పేర్కొంటూ మళ్లీ ప్రతిపాదన పంపాలని గవర్నర్‌ పేర్కొన్నారు. దాంతో, బుధవారం మళ్లీ సమావేశమైన సీఎం గహ్లోత్‌ కేబినెట్‌.. ఆగస్ట్‌ 14 నుంచి సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది.

కేబినెట్‌ సిఫారసులను వెనక్కు పంపిస్తూ.. గవర్నర్‌ ప్రతీసారి ప్రస్తావిస్తున్న 21 రోజుల నోటీసు పీరియడ్‌ నిబంధన అమలయ్యేలా ఆగస్ట్‌ 14వ తేదీని అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి సీఎం గహ్లోత్‌ ఎంచుకున్నారు. గవర్నర్‌కు తొలి ప్రతిపాదన పంపిన జులై 23 నుంచి పరిగణనలోకి తీసుకుని తాజా ప్రతిపాదనను పంపించారు. స్వల్ప వ్యవధి నోటీసుతో సమావేశాలను ప్రారంభించేందుకు కారణం చూపకపోతే 21 రోజుల నోటీసు వ్యవధితో సమావేశాలను ప్రారంభించవచ్చని గత ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.  

ప్రేమ లేఖ అందింది: ఈ నేపథ్యంలో గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో దాదాపు పావుగంట పాటు సీఎం గహ్లోత్‌ సమావేశమయ్యారు. ‘ప్రేమ లేఖ అందింది. తేనీటి సేవనం కోసం ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తున్నాను’అని రాజ్‌భవన్‌కు వెళ్లేముందు గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. గవర్నర్‌తో సమావేశం తరువాత కేబినెట్‌ భేటీ నిర్వహించారు. అనంతరం, ఆగస్ట్‌ 14 నుంచి శాసన సభ సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ మరో ప్రతిపాదనను గవర్నర్‌ పంపించారు.

మరోవైపు, గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను బుధవారం అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి కలిశారు. కాగా, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ బహుజన్‌ సమాజ్‌ పార్టీ బుధవారం రాజస్తాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశామని, స్పీకర్‌ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని బీఎస్పీ రాజస్తాన్‌ శాఖ అధ్యక్షుడు భగవాన్‌ సింగ్‌ బాబా తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top