బీసీలకు 11 ఎమ్మెల్సీ స్థానాలివ్వడం రికార్డే

R Krishnaiah Comments On CM YS Jagan - Sakshi

బీసీల అభివృద్ధికి కట్టుబడిన నేత సీఎం జగన్‌

గత పాలకులు మూడో, నాలుగో స్థానాలు ఇచ్చేవారు 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు బాబు ఇచ్చింది 37.5 శాతమే 

ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ఇచ్చింది 68.18 శాతం 

సాధికారతకు సీఎం జగన్‌ సిసలైన నిర్వచనం ఇచ్చారు 

రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 స్థానాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు కేటాయించటం దేశ చరిత్రలో ఓ రికార్డు అని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ... బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్న నేతగా సీఎం వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు.

శాసన మండలి స్థానాల్లో మూడు లేదా నాలుగు స్ధానాలు బీసీలకు ఇస్తారని భావించానని, కానీ జగన్‌ ఏకంగా 11 స్ధానాలివ్వడంతో ఆశ్చర్యపోయనని చెప్పారు. గత ప్రభుత్వం అతి తక్కువ స్థానాలు బీసీలకు ఇచ్చి, వారిది బీసీల ప్రభుత్వమని, బీసీలను ఉద్దరిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునేవారన్నారు.

ఇప్పడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పార్లమెంట్‌ సభ్యుల నుంచి మంత్రులు, ఎంపీటీసీల వరకు బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యం దేశంలో మరే రాష్ట్రంలో కనిపించదని తెలిపారు. అందుకే బీసీలంతా వైఎస్‌ జగన్‌ సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ‘2014 –19 మధ్య టీడీపీ శాసన మండలికి 48 మందిని పంపితే.. అందులో ఓసీలు 30 మంది ఉండగా, బీసీలు 12 మంది మాత్రమే.

ఓసీలకు ఏకంగా 62.5 శాతం పదవులివ్వగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన పదవులు కేవలం 37.5 శాతమే. టీడీపీ వంచనకు ఇదే నిదర్శనం. దీనికి భిన్నంగా సీఎం వైఎస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు  68.18 శాతం పదవులివ్వడం ఈ వర్గాల సాధికారత పట్ల ఆయన చిత్తశుద్ధిని నిరూపిస్తోంది.

చంద్రబాబు, సీఎం జగన్‌ మధ్య ఆ తేడాను అందరూ గుర్తించాలి. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడానికి ముందే బీసీ అధ్యయన కమిటీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం కమిటీలు వేశారు. వాటి సిఫార్సులకు అనుగుణంగా బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదని, బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా సీఎం జగన్‌ గుర్తించారు.

కాబట్టే ఆ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. పదవులన్నిటిలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చారు. కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సాధికారత కల్పిస్తున్నారు. సీఎం జగన్‌ సాధికారతకు సిసలైన నిర్వచనం ఇచ్చారు’ అని కృష్ణయ్య చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top