
నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు దశాబ్దాల తర్వాత 403 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. ఇన్నేళ్ల తర్వాత అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడం తమ పార్టీ సాధించిన అతి పెద్ద విజయమని అన్నారు. నోయిడాలో సోమవారం ప్రియాంక విలేకరులతో మాట్లాడుతూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోరాటం చేయాలని అనుకున్నప్పుడే తాను ఎఫ్‌ఐఆర్‌లు, కోర్టు కేసులు, జైలుకి వెళ్లడానికి కూడా సిద్ధపడ్డానని తెలిపారు.
కేంద్రం ద్రోహం చేసింది
నోయిడా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను నమ్మించి ద్రోహం చేసిందని, సుదీర్ఘ ఉద్యమాలకు సిద్ధం కావాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)నేత రాకేశ్ టికాయత్ పిలుపునిచ్చారు. పోరాటంలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని ఎందుకివ్వలేదో, కనీస మద్దతు ధర సమస్య మీద... కమిటీ నియమిస్తామని చెప్పి ఎందుకు వేయలేదో వివరణ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులను మోసం చేసి.. కేంద్రం పుండు మీద కారం చల్లిన చందంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆందోళన సమయంలో రైతులపై పెట్టిన కేసులను కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకోలేదన్నారు. బీకేయూ, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్వాప్తంగా ‘ద్రోహ దినం’ నిర్వహించారు. రాజస్థాన్‌లోని వివిధ జిల్లా కేంద్రాల్లో రైతులు ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.