పంచాయతీ ఫలితాలను మించి.. | Peddireddy Ramachandra Reddy Comments On Municipal election | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఫలితాలను మించి..

Mar 6 2021 6:22 AM | Updated on Mar 6 2021 6:22 AM

Peddireddy Ramachandra Reddy Comments On Municipal election - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ సుపరిపాలనకు మద్దతుగా పార్టీరహితంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికిపైగా గ్రామాల్లో అధికార వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని, పార్టీ గుర్తులతో జరిగే మునిసిపాలిటీ ఎన్నికల్లో అంతకుమించిన ఫలితాలను వైఎస్సార్‌ సీపీకి కట్టబెట్టబోతున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 80 శాతానికిపైన.. 90 శాతం వరకు వార్డులు, డివిజన్లలో గెలుపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులదేనన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఉన్నతాధి కారులు, జిల్లా అధికారులతో మంత్రి శుక్రవారం సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పనితీరు, ప్రభుత్వ పాలన కు మద్దతుగా స్థానిక ఎన్నికలలో ప్రజాతీర్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీల్ని ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రభుత్వ పథకాలను అందించిందన్నారు. సీఎం జగన్‌ మాత్రం అర్హతే కొలమానంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్‌కు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారన్నారు. 

గ్రామీణప్రాంతాల్లో 3,185 కిలోమీటర్ల రోడ్లు..
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పీఎంజీఎస్‌వై కింద కొత్తగా 3,185 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు పెద్దిరెడ్డి తెలిపారు. తొలివిడత కింద రూ.524.36 కోట్లతో 935.84 కిలోమీటర్ల మేర పనులను ప్రారంభించామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పేదకూలీ లకు రికార్డు స్థాయిలో పనులు కల్పించినట్టు చెప్పారు. 2020–21లో 25.25 కోట్ల పనిదినాలను కల్పించాలనేది లక్ష్యమని, ఇప్పటివరకు 23.67 కోట్ల పనిదినాలను కల్పించినట్టు చెప్పారు. కూలీలకు ఇప్పటివరకు రూ.5,423 కోట్లు వేతనాల రూపంలో చెల్లించామన్నారు.

గ్రామ సచివాలయాలు, అంగన్‌వాడీ, వెల్‌నెస్‌ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణానికి మరో రూ.4 వేల కోట్ల వరకు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.3,086 కోట్ల మేర పనులు పూర్తి చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 19,21,050 ఇళ్లకు ఈ ఏడాది కొత్తగా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని..  ఈనెల ప్రారంభం నాటికి 9,41,731 ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నెలాఖరుకు మరో ఆరులక్షల కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించామన్నారు. వ్యవసాయ బోర్లకోసం రైతు లు అప్పులుపాలు కాకూడదనే ఆశయంతో సీఎం జగన్‌ వైఎస్సార్‌ జలకళ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని.. ఇందుకు మూడేళ్లలో రూ.4వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement