
తాడేపల్లి: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల అంఃశానికి సంబంధించి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ప్రజలను భయపెట్టి ఎన్నికలకు రాకుండా చేసి గెలవాలని చూస్తున్నారు.రెవిన్యూ యంత్రాంగం నిస్సిగ్గుగా టీడీపీ కోసం పని చేస్తుంది. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?, రెండు దశాబ్దాల క్రితం బిహార్‌లో ఉన్న పరిస్తితి టీడీపీ ప్రభుత్వం ఏపీలో తీసుకు వచ్చింది. కొంతమంది అధికారులు మితి మీరిన ఉత్సాహంతో పని చేస్తున్నారు.
వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది. పులివెందుల ఎన్నికలతోనే రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయా?, ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చేశారు.ప్రజలు ఓటు వేయాలి అనుకుంటున్నారా?, ఓటు వేయొద్దు అనుకుంటున్నారా?, మీరు ఎవరు ఓటుకు రావాల్సిన అవసరం లేదనే దురహంకారంతో మార్చారు. ప్రజా స్వామ్య బద్దంగా పులివెందుల ఎన్నిక నిర్వహించండి. ప్రజలు ఎవరి పక్షంగా ఉన్నారో తెలుస్తుంది. నిజంగా టిడిపి గెలిచే పరిస్తితి ఉంటే ఈ దాడులు ఏంటి?, రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు సునీత బయటకు వస్తారు. ప్రభుత్వాన్ని కాపాడటానికి మాట్లాడతారు. చంద్రబాబు మీ నాయకుడే కదా...ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. ఇంకా అధికారులను కలవడం ఎందుకు?’ అని ప్రశ్నించారు.