
సాక్షి, పులివెందుల: పులివెందులలోని మార్కెట్ యాడ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చీనీ రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదని మార్కెట్ యార్డులో రైతులు ధర్నాకు దిగారు. వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి.. రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. పులివెందులలోని మార్కెట్ యాడ్‌లో చీనీ రైతులు నిరసనలు తెలుపుతున్నారు. తమకు కనీస గిట్టుబాటు ధర లేకపోతే మార్కెట్ యార్డుకు తాళాలు వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్కెట్‌లో వ్యాపారస్తులందరూ సిండికేట్ అయ్యారని.. రైతులను నిండా ముంచుతున్నారని మండిపడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చీనీ మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారు. తోటల వద్దకే వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేసే వారు చెబుతున్నారు.
అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థ నడుస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పులివెందుల చీనీ మార్కెట్ యార్డులో దళారులంతా ఏకమై రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. మరోవైపు.. రైతులకు గిట్టుబాటు కాకపోతే అనంతపురం మార్కెట్ యార్డుకు తీసుకుపోండి అని వ్యాపారస్తులు ఉచిత సలహా ఇస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
