
వైఎస్ఆర్ కడప జిల్లా: ఎర్రగుంట్ల పట్టణం 17వ వార్డులోని న్యూకాలనీలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుమార్ అనే వ్యక్తి ఇంటి ముందు గేటుకు ఎదురుగా బొమ్మ, దానిపై ఇనుప రేకులు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచి క్షుద్ర పూజలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున బయటకు వచ్చిన కాలనీ వాసులు వీటిని చూసి భయాందోళన చెందారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు.
ఆరు నెలల క్రితం అదే కాలనీలో ఇంటి బయట టెంకాయతో పూజలు చేసి ఉంచారన్నారు. మళ్లీ అదే తరహాలో జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సోమవారం రాత్రి వర్షం కారణంగా బయటకు రాలేదని, మంగళవారం తెల్లవారుజామున బయటకు రాగానే ఈ దృశ్యం కనిపించిందన్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో తెలియలేదని చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.