
సాక్షి, హైదరాబాద్: ఏ పార్టీలో చేరాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలోకి తాను చేరుతున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచారం జరుగుతోందని.. అలాంటి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయొద్దంటూ విజ్ఞప్తి చేసిన రాజాసింగ్.. కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
కాగా, రాజీనామాపై మరోసారి స్పందించిన రాజాసింగ్.. పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదన్నారు. హిందుత్వ భావజాలంతో ప్రజలకు సేవ చేయాలనే బీజేపీలోకి చేరానని తెలిపారు. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరును నిరసిస్తూ రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు.