మరింత సమన్వయంతో ముందుకు...

Meeting of Congress CPI and TJS leaders - Sakshi

కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌ నేతల భేటీలో నిర్ణయం 

హాజరైన ఠాక్రే, చాడ, పి.ఎల్‌.విశ్వేశ్వరరావు 

ఎన్నికల ప్రచారంలోఅనుసరించాల్సిన వ్యూహంపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లు మరింత సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల కేడర్, నేతలను సమ న్వయం చేసుకునేందుకు కమిటీలను ఏర్పాటు చేసుకోనున్నా యి. ఈ మేరకు మంగళవారం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మూడు పార్టీల నేతలు సమావేశమయ్యారు.

మాణిక్‌రావ్‌ఠాక్రే, మహేశ్‌కుమార్‌గౌడ్‌ (కాంగ్రెస్‌), చాడ వెంకట్‌రెడ్డి, బాల మల్లేశ్‌ (సీపీఐ), ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌రావు (టీజేఎస్‌) తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తమ కూటమి గెలుపు అంచనాలు, ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఈ రెండు వారాల సమయం చాలా కీలకమని, మూడు పార్టీల నాయకత్వం కలిసికట్టుగా పనిచేసి బీఆర్‌ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించేలా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ స్థాయిలోనూ మూడు పార్టీ ల కేడర్, నేతల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీ లు కలిసి పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. 

రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు: మూడు పార్టీ ల నాయకులు మూకుమ్మడిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ కన్వినర్‌గా బి. మహేశ్‌కుమార్‌గౌడ్‌ (టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)ను నియమించారు.

ఈయనతో పాటు మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. చాడ వెంకట్‌రెడ్డి, బాల మల్లేశ్, ఈటి నర్సింహ (సీపీఐ), కోదండరాం, పి.ఎల్‌. విశ్వేశ్వర్‌రావు, రమేశ్‌ (టీజేఎస్‌)లను కూడా కమిటీ సభ్యులుగా నియమించారు. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కూడా కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌ నేతల సమావేశంలో నిర్ణయించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top