వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి

Mayawati calls RSS silence over the country atmosphere - Sakshi

లక్నో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ మాయావతి ఆరోపించారు. లక్నోలో బీఎస్పీ పథాధికారులతో భేటీ సందర్భంగా మాయావతి ప్రసంగించారు. ‘ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, హింస నెలకొన్నాయి. ఈ అంశాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ మౌనమునిగా మారింది. మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ ముందువరసలో నిల్చుంటుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ మరో కుట్రకు తెరతీసింది.

మతమార్పిడి, అధిక జనాభా అంటూ కొత్త విషయాలకు ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలొచ్చినా బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుపలుకుతుంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కనీసం ఒక్కసారైనా ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ మౌనం విచారకరం, అంతేకాదు దేశానికి హానికరం ’ అని అన్నారు. మతమార్పిడి, బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసల కారణంగా అధిక జనాభా సమస్య తలెత్తుతోందని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాయావతి స్పందించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top