తెలంగాణ కాంగ్రెస్‌ సభ్యత్వ లక్ష్యం.. 35 లక్షలు

Manickam Tagore Said Congress To Power In Telangana In The Upcoming Elections - Sakshi

80 లక్షల ఓట్లు రావాలి.. 78 అసెంబ్లీ సీట్లు గెలవాలి

2023 ఎన్నికల వరకు టార్గెట్‌గా పెట్టుకుని పనిచేయండి: ఠాగూర్‌

ఇకపై నియోజకవర్గ ఇన్‌చార్జీలుండరు 

పనిచేసే వారికి గౌరవం.. పనిచేయని వారికి ఉద్వాసన: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌/కుత్బుల్లాపూర్‌: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ కేడర్, నాయకులు పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్యం ఠాగూర్‌ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలోని 35 లక్షల మందిని కాంగ్రెస్‌లో సభ్యులుగా చేర్పించాలి. ఈసారి మన బ్యాలెట్‌ బాక్సుల్లో 80 లక్షల ఓట్లు పడాలి. అప్పుడే మనం నిర్దేశించుకున్న 78 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. ఆ దిశలో పార్టీ కేడర్‌ ముందుకెళ్లాలి’అని ఆయన కోరారు. కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరంలో భాగంగా మొదటిరోజు మంగళవారం కొంపల్లిలోని ఒయాసిస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ.. 2023 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించుకుని పనిచేయాలని కోరారు.

నేను గొప్ప అంటే నేనే గొప్ప అంటూ గొడవలు పెట్టుకోవద్దని, కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. నియోజకవర్గ ఇన్‌ చార్జీలను కొనసాగించబోమని.. బ్లాక్, మండల, నగర, పట్టణ, జిల్లా అధ్యక్షులే కలిసికట్టుగా పార్టీని నడిపిస్తారని చెప్పారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల కష్టం వల్లే నాయకులుగా తాము పదవులను అనుభవిస్తున్నామని, కాంగ్రెస్‌కు కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణ గీత దాటితే సహించేది లేదని హెచ్చరించారు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, పనిచేయని వారికి ఉద్వాసన తప్పదని అన్నారు. జనవరి 26 తర్వాత ఈ చర్యలు తీసుకోవడం మొదలుపెడతానని చెప్పారు. కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన వారు చచ్చినవారితో సమానమని, కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుం టానని వెల్లడించారు.

పేర్లు మార్చారని ఆందోళన: కాంగ్రెస్‌ సదస్సుకు జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి బ్లాక్, మండల అధ్యక్షులతో హాజరయ్యారు. అయితే.. అప్పటికే రాత్రికి రాత్రే బ్లాక్, మండల కమిటీలో పేర్లు వచ్చినవారు సదస్సుకు వచ్చా రు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాఘవరెడ్డి.. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను నిలదీయడమే గాక ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసు కోవడం గమనార్హం. అయితే.. అందరితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని రేవంత్‌ వారికి హామీ ఇచ్చారు. తర్వాత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై రాఘవరెడ్డి వర్గం తీవ్ర విమర్శలు చేస్తూ వెళ్లిపోవడం కనిపించింది.

శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్సే...
దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చి పోతుం టాయి కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు.. కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేయగల శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని భట్టి చెప్పారు. తొలిరోజు పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సహా 1,200 మందికి పైగా బ్లాక్, మండల, పట్టణ, నగర, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 

ఘన చరిత.. కాంగ్రెస్‌దే భవిత.. 
తొలిరోజు శిక్షణలో భాగంగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ‘కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర– దేశ నిర్మాణంలో పాత్ర’అనే అంశంపై ఇచ్చిన ప్రెజెంటేషన్‌ అందరినీ ఆకట్టుకుంది. పార్టీ ఆవిర్భావంతో పాటు స్వాతంత్య్ర పోరాటం నుంచి దేశాన్ని బలమైన ఆర్థిక, సామాజిక పునాదులపై కాంగ్రెస్‌ ఎలా నిలబెట్టిందనే అంశంపై ఆయన కూలంకషంగా వివరించారు. అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. దేశంలోనే ఘన చరిత ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్ర లేక ఇతర పార్టీల చరిత్రను తనదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top