ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తాం..  | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొస్తాం.. 

Published Sun, Jul 16 2023 2:05 AM

Mallu Bhatti Vikramarka at a media conference held at Gandhi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రజల అవసరాలే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వాన్ని త్వరలోనే తీసుకువస్తామని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పి) నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా తన పాదయాత్ర అనుభవాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి 16 నుంచి జూలై 2వ తేదీ వరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని పిప్పి రి గ్రామం నుంచి ఖమ్మం నగరం వరకు నిర్వహించిన ‘పీపుల్స్‌ మార్చ్‌’అనుభవాలను శనివారం గాందీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. తన పాదయాత్ర సందర్భంగా అనేక విషయాలను తాను ప్రత్యక్షంగా చూశానని, కొన్ని పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయని చెప్పారు.

తొమ్మిదిన్నరేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీఆర్‌ఎస్‌ మసిపూసి మారేడు కాయ చేస్తోందని విమర్శించారు. గోబెల్స్‌ ప్రచారంతో అద్భుతాలు జరిగినట్టు, బంగారు కుటుంబాలు తయారయినట్టు కట్టుకథలతో నెట్టుకొస్తోందని భట్టి నిందించారు. 

ఆ రూ.5లక్షల కోట్లు ఎటుపోయాయో? 
‘‘రాష్ట్రంలో రైతులు బాగుపడలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. దళితులకు భూమి ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్‌ అమలు కావడం లేదు. గిరిజనులకు పోడు హక్కులు క ల్పించలేదు. ఐటీడీఏలను నిర్వీ ర్యం చేశారు.. యూనివర్శిటీల్లో నియామకాలు లేవు. మరి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక పెట్టిన తొమ్మిది బడ్జెట్‌ల నిధులు ఏమయ్యాయో తెలీదు. అప్పుగా తెచ్చిన రూ.5లక్షల కోట్లు ఎటుపోయాయో అర్థం కాదు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు.’అని వ్యాఖ్యానించారు. 

త్వరలో ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం 
సాగునీటిలో రాష్ట్రానికి గుండు సున్నా అని, గోదావరి, కృష్ణా నదులపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టుల నుంచి నీరివ్వకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని భట్టి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందో చెప్పేందుకు, వాస్తవ పరిస్థితులను వివరించేందుకు త్వరలోనే ప్రాజెక్టుల వద్దకు వెళ్తామని, అక్కడ çపరిస్థితులను ప్రజలకు వివరించి సెల్ఫీలు దిగి చూపెడతామని వెల్లడించారు. 

ఇక్కడ ఫ్యూడల్‌.. అక్కడ బహుళజాతి సర్కారు 
తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని భట్టి వ్యాఖ్యానించారు. ఎవరు ఏం మాట్లాడాలన్నా భయపడుతున్నారని, ఏం మాట్లాడితే ఏం కేసు పెడతారో అనే భయంతో బతికే పోలీసు రాజ్యాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఫ్యూడల్‌ ప్రభుత్వం, దేశంలో బహుళ జాతి ప్రభుత్వం కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. 

వైఎస్సార్‌ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే  మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్‌ 
2004లో అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ పా ర్టీదని, ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ తమకే ఉందని భట్టి స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఎవరూ ఆలోచించనప్పుడే 1999లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రైతులకు ఉచిత విద్యుత్‌ను మేనిఫెస్టోలో చేర్చామన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఉచిత విద్యుత్‌ పేరు చెప్పేముందు కాంగ్రెస్‌ పా ర్టీకి దండం పెట్టాలని వ్యాఖ్యానించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా ఫామ్‌హౌస్‌ సంస్కృతిని తీసుకువచ్చారని ఆరోపించారు. జర్నలిస్టులకు ఎప్పుడు ఇండ్ల స్థలాలు ఇచ్చినా కాంగ్రెస్‌ పా ర్టీనే ఇచ్చిందని, మళ్లీ ఇచ్చేది కూడా కాంగ్రెస్‌ పా ర్టీనేనని వ్యాఖ్యానించారు. సీఎం కురీ్చలో ఎవరు కూర్చుంటారన్నది ఇప్పుడు అప్రస్తుతమని ఓ ప్రశ్నకు సమాధానంగా భట్టి స్పష్టం చేశారు. 

గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళులు 
నాంపల్లి: 1440 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం గన్‌పార్కు వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, కార్యకర్తలతో కలిసి భట్టి విక్రమార్క తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నేతలు చల్ల నరసింహారెడ్డి, జగదీష్‌ రావు, బల్మూరి వెంకట్, అజ్మతుల్లా హుస్సేని, ప్రేమ సాగర్, సిరిసిల్ల రాజయ్య, కుంభం అనీల్‌కుమార్‌ రెడ్డి, నూతి శ్రీకాంత్, పల్లవి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement