
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు గమ్మత్తుగా ఉంటుంది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన విషయం ప్రజలకు గుర్తు రాకుండా చేసేందుకు అన్ని రకాల గిమ్మిక్కులూ చేస్తుంటారు. చిన్న, చితకా విషయాలపై సమీక్షల పేరుతో గంటల కొద్దీ సమావేశాలు పెట్టడం.. ఆ వార్తలు తమ అనుకూల పత్రికల్లో ప్రముఖంగా వచ్చేలా చూసుకోవడం.. ఇదీ బాబు మోడల్.
చంద్రబాబు ఈ నెల 19న జరిపిన సమీక్ష సమావేశాలనే ఉదాహరణగా తీసుకుందాం. రెండు అంశాలు. ఒకటి.. ప్రభుత్వ సేవలలో లోపాలకు చెక్ పెట్టాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్‌తో మార్పులు చేయాలి అని!. రెండోది... గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా? అన్నది. మామూలుగా చూస్తే ఇది బాగానే ఉంది కదా? అనిపిస్తుంది. కానీ.. ఇది ఒక ముఖ్యమంత్రి సమీక్షించాల్సిన అంశాలా? కింది స్థాయి అధికారో.. లేక సంబంధిత శాఖల మంత్రులో చేస్తే సరిపోదా? అన్నది ప్రశ్న! పైగా తమ సొంత నిర్ణయాల కారణంగా నిన్న మొన్నటి వరకూ ప్రజలకు అందుతున్న రకరకాల సేవలను తొలగించి ఇలా మాట్లాడటం బాబుకే చెల్లుతుంది!.
ఈ సమీక్షలోనే రేషన్ సరుకులు పంపిణీ విషయంలో 74 శాతం మంది తమకు రేషన్ అందుతోందని చెప్పారట. ఆయన అడగాల్సిన ప్రశ్న ఇదా? ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని తొలగించిన తరువాత ఏం జరుగుతోందని కదా?. ఇంటి పట్టున అందే రేషన్ అందక ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. కొన్నిసార్లు రద్దీ కారణంగా తోపులాటలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చిత్తశుద్ధిగల ప్రభుత్వం ఏదైనా ఇళ్లవద్దకే రేషన్ అందివ్వాలా? లేక షాపుల వద్దనైనా ఓకేనా? అని ప్రజలను అడిగి తెలుసుకోవాలి. ఇవేవీ చేయకుండానే.. రేషన్ సరఫరా వాహనాలను సేవల నుంచి తొలగించాలని మంత్రివర్గం ఎలా నిర్ణయించింది? ఎవరిని మభ్య పెట్టడానికి ఈ సమీక్ష!.
గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయమూ ఇంతే. ఏజెన్సీల నుంచి సిలిండర్లు తీసుకొచ్చేవారికి ఎంతో కొంత టిప్ ఇవ్వడం సాధారణమే. ఇవ్వకపోయినా చెల్లుతుంది. పైగా ఇలాంటి అంశాల గురించి సాధారణంగా కలెక్టర్లు తమ సమీక్షల్లో చర్చిస్తుంటారు. పౌర సరఫరాల శాఖకు ఒక మంత్రి కూడా ఉన్నారు. వీరి స్థాయిలో జరగాల్సిన పనులను ముఖ్యమంత్రి స్వయంగా చేపట్టడం ఎంత వరకూ సబబు?. వాస్తవానికి బాబు సమీక్షించాల్సిన అంశం తాము ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ ఎలా అమలవుతోంది? అని!. ఏడాదికి ఒక సిలిండర్.. అది కూడా కొంతమందికే ఇవ్వడం వల్ల ప్రజలేమనుకుంటున్నారు? అని!. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎల్లో మీడియాలో రాయించుకుంటే ఏం ప్రయోజనం?. పైగా ఇప్పుడు ఇంకొ కొత్తమాట మాట్లాడుతున్నారు.. మూడు సిలిండర్లకు డబ్బులు ప్రజల ఖాతాల్లోకి వేస్తామూ అంటున్నారు. మంచిదే కానీ.. వీటికి నిధులు ఎక్కడివి అని కూడా చెబితే కదా ప్రజలకు నమ్మకం కుదిరేది?. పంచాయతీలలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతోందని అరవై శాతం మంది ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కూడా సీఎం స్థాయి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చిన అంశం.
జగన్ టైమ్‌లో కొద్దిపాటి నిర్వహణ ఛార్జీలతో చెత్త తరలింపు సమర్థంగా చేపడితే ‘‘చెత్త పన్ను’’ అంటూ బాబు అండ్ కో వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు చెత్తపన్ను తీసేశామని చెప్పి... ఆస్తి పన్ను పెంచేశారు! పోనీ చెత్త తొలగింపు జరుగుతోందా అంటే అది అంతంత మాత్రమే!. చెత్త సరిగా ఎత్తడం లేదని 40 శాతం మంది చెప్పారంటేనే ఆ విషయం స్పష్టమవుతోంది!. స్వచ్చాంద్రప్రదేశ్ పేరుతో చంద్రబాబు ఈ మధ్య ప్రత్యేక సభలు పెడుతున్నారు. ఈ మాత్రం పని పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత మంత్రులు చేయలేకపోయారా?. పంచాయతీ రాజ్ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? బహుశా ఆయన సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్నారేమో మరి.
ఆర్టీసీ బస్‌స్టాండ్లలో సేవలపై ప్రజలలో అసంతృప్తి ఉందని తేలిందట. తాగునీరు, టాయిలెట్లు తదితర సదుపాయాలు బాగోలేవట. ఈ సంగతి ముఖ్యమంత్రి స్థాయిలో కనిపెట్టాలా? మరి సంబంధిత మంత్రి ఏమి చేస్తున్నారు?. ఆర్టీసీకి అవసరమైన నిధులు కేటాయించినా అధికారులు ఎందుకు ఈ సేవలు అందించ లేకపోతున్నారు?. ఇక వాట్సప్ సేవలతో అన్ని జరిగిపోతున్నట్లు ప్రొజెక్టు చేయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 375 సేవలు అందిస్తున్నారని, జూన్ 12 నాటికి 500 సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. బాగానే ఉంది. ఇంతవరకు 45 లక్షల మంది ఈ సేవలను వాడుకున్నారట. ఏపీ జనాభా ఐదు కోట్లు అనుకుంటే ఈ సేవలను పది శాతం మంది మాత్రమే వాడుకున్నారన్న మాట!. వాట్సప్ సేవల సంగతేమో కాని, జనం ప్రతీ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వస్తోంది.
జగన్ హయాంలో ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, వలంటీర్ల వ్యవస్థలన్నీ నీరు కార్చి ఇప్పుడు వాట్సాప్ కథలు చెబుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం ఐదు వేల నుంచి పది వేలకు పెంచుతామని ఉగాది నాడు పూజలు చేసి మరీ వాగ్దానం చేసిన చంద్రబాబు దానిని గాలికి వదిలి వేశారు. దీనిపై కూడా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనవసరం లేదా!. ఆరోగ్యశ్రీని క్రమేపి బీమా కిందకు మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా?.
కొన్ని ప్రభుత్వ సంస్థలలో నెలల తరబడి జీతాలు అందడం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలపై అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాటిపై సమీక్ష జరిపితే పది మందికి మేలు జరుగుతుంది. ఏది ఏమైనా తాను ఇచ్చిన హామీలను అమలు చేసి ఆ తర్వాత వాటి తీరుతెన్నులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటే ఉపయోగం తప్ప, ఇలా విషయం లేని అభిప్రాయ సేకరణలు జరిపి, ఈ స్థాయిలో వాటిని సమీక్షించడం అంటే అవి సీఎం వద్ద జరిగే కాలక్షేపం మీటింగులే అని ప్రజలు భావిస్తారని చంద్రబాబుకు తెలియదా!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.