
‘‘పిల్లలకు మనం ఇచ్చే సంపద చదువే.. పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాద్యమం బోధిస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తరచూ చేసిన వ్యాఖ్యలు. అవిప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. జాతీయ నాయకులు కొందరు కూడా వీటిని ప్రస్తావిస్తున్నారు. జగన్ వల్లే వీరు ఈ విషయాలు చెబుతున్నారనడం లేదు. కాని వీరందరికన్నా ముందు జగన్ మాట్లాడారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే..
ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నేతలు, ఇతర పార్టీల వారు కూడా చాలామంది జగన్‌పై నానా విమర్శలూ చేశారు. ఒక బీజేపీ నేత ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది కాని తరువాత ఏమైందో తెలియదు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పేదలకు ఆంగ్ల మీడియం కొనసాగేందుకు జగన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంగ్ల మీడియం ప్రస్తావన తేవడంతో జగన్ వ్యాఖ్యలకు ప్రాముఖ్యత వచ్చింది.
'దేశాభివృద్దికి డబ్బు, భూములు ముఖ్యం కాదు. తెలంగాణ కుల గణనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. ఈ సర్వేకి ముందు నేను కూడా భూములే ముఖ్యం అనుకునేవాడిని. కాని ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యమైన అంశమని కులగణన నిపుణుల కమిటీ అన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లీష్ అవసరం. అలాగని హిందీ, ఇతర ప్రాంతీయ భాషలను వద్దనడం లేదు. ఈ భాషలతోపాటు ఇంగ్లీష్ నేర్పాల్సిన అవసరముందన్నది చారిత్రక వాస్తవం. మన పురోగతిని నిర్దేశించేది ఆంగ్ల భాషే. ఏ బీజేపీ నేతను ప్రశ్నించినా ఇంగ్లీష్ మీడియం వద్దని అంటారు. కానీ వారి పిల్లలు ఏ స్కూల్, కాలేజీలో చదువుతున్నారని ప్రశ్నిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, కాలేజీలే అని సమాధానం వస్తుంది. ఆ అవకాశాన్ని దేశంలో బలహీన వర్గాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎందుకు బీజేపీ నేతలు దక్కనివ్వరు’’ అని రాహుల్ ఢిల్లీలో జరిగిన ఓ మీటింగ్‌లో అన్నారు.
రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాలలోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటింది. కాని ఆయనకు ఆంగ్ల మాద్యమం ప్రాముఖ్యత ఇప్పటికి తెలియడం చిత్రంమే. అది కూడా తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే నివేదిక వచ్చాక అవగాహన రావడం విశేషం. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా హిందీ భాషను ప్రోత్సహించాలంటూ ఆంగ్ల భాషకు వ్యతిరేకంగా మాట్లాడారు. విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించ లేదు. అమిత్ షాకు జవాబు ఇవ్వడం కోసం రాహుల్ ఈ ప్రకటన చేశారు.
సుమారు ఏభై ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆంగ్ల మాధ్యమం అవసరాన్ని గుర్తించిందనుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా, అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ తదితర దేశాలలో భారతీయ విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీష్ మాధ్యమం చాలా అవసరం అన్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఆంగ్లం అనేది భాషా వారధిగా ఉంటోందన్న సంగతి విస్మరించకూడదు. తెలంగాణలో జరిగిన సర్వేలో ఆస్తులు ఉన్నా, చదువు సరిగా లేకపోతే ప్రయోజనం లేదని పలువురు అభిప్రాయపడ్డారని సమాచారం. పేదరికం తగ్గాలంటే చదువే ముఖ్యమని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆంగ్ల భాష విద్య మాధ్యమంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు.
కాగా మూడు టర్మ్‌లు పాలన చేస్తున్న బీజేపీ పనికట్టుకుని హిందీ గాత్రాన్ని తీసుకు రావడం, అది తమిళనాడులో వివాదంగా మారడంతో కొంత వెనక్కి తగ్గడం జరిగింది. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేనలు హిందీకి కోరస్ పలికి విమర్శలకు గురయ్యాయి. కేవలం బీజేపీ ప్రాపకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లు హిందీని పొగిడారని పలువురు ఎద్దేవ చేశారు. పవన్ హిందీని పెద్దమ్మ భాష అనడంపై నవ్వుకున్నారు. తెలుగు భాషా నిపుణులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో ఈ కూటమి నేతలు అప్పటి సీఎం జగన్‌పై కక్షతో ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదే టైమ్ లో వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలోనే ఎందుకు చదువుతున్నారన్న ప్రశ్నకు జవాబు ఇచ్చేవారు కారు.
టీడీపీ భజన చేసే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా మురికి వార్తలు రాస్తుండేవి. అదే టైమ్‌లో వారి కుటుంబాల వారంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకునే వారు. ఈ విషయంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం విమర్శలకు గురయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలోనే సినీ ప్రముఖుడు నారాయణ మూర్తి పేదలు అభివృద్దికి ఇంగ్లీష్ విద్య అవసరమని కుండబద్దలు కొట్టడం అందరిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు హిందీ భాష రాజ్యభాష అని వ్యాఖ్యానించి దెబ్బతిన్నారు. ప్రముఖ మేధావి, మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు దేశంలో రాజ్యభాష ఏదీ లేదన్న సంగతి గుర్తు చేయాల్సి వచ్చింది.
ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగడానికి అసిధారవృతం చేశారు. చిన్న వయసు నుంచే పిల్లలకు ఐబీ సిలబస్ ప్రవేశపెట్టడం, టోఫెల్ వంటివాటిలో శిక్షణ ఇవ్వడం, స్కూళ్లను బాగు చేయడం, విద్యా దీవెన, గోరు ముద్ద వంటి స్కీములను అమలు చేసి దేశంలోనే ఒక రికార్డు సృష్టించారు. వీటి ఫలితంగా పలు స్కూళ్లలో పిల్లలు ఐక్యరాజ్యసమితికి వెళ్లి మాట్లాడే స్థాయికి చేరుకున్నారు. అమ్మ ఒడి స్కీమ్ తెచ్చి ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగేలా జగన్ చేశారు . జాతీయ మీడియా హిందీ భాష లో బోధన గురించి ప్రశ్నిస్తే, చాలా స్పష్టంగా హిందీ నేర్చుకుంటే తప్పు కాదని, కాని ఆంగ్ల మీడియం మాత్రం తప్పనిసరి అని, అదే దేశంలోని విద్యార్ధులకు మేలు చేస్తుందని జగన్ చెప్పారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రచారార్భాటానికి ఇస్తున్న ప్రాముఖ్యత విద్యా వ్యవస్థ బాగుపై పెట్టడం లేదని, తత్ఫలితంగా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్‌ను సకాలంలో అమలు చేయడం ద్వారా పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్కీమ్ బకాయిలు సుమారు రూ.4200 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా..

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇంగ్లీష్ మీడియం అవసరం అనే విషయం మరోసారి నిర్దారణైంది. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న నేతలందరి కన్నా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ముందుగా గుర్తించి దేశానికి ఒక రకంగా ఆదర్శంగా నిలిచారని చెప్పక తప్పదు. మాతృభాష మన సంస్కతిని కాపాడేదైతే, ఆంగ్ల భాష ప్రపంచంతో పోటీపడేలా చేస్తుందన్న జగన్ కొటేషన్ ను ఎవరైనా అంగీకరించాల్సిందే.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.