ప్చ్‌.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు! | KSR Comment: What Kavitha gain From KCR After Press Meet | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు!

Sep 5 2025 10:07 AM | Updated on Sep 5 2025 1:45 PM

KSR Comment: What Kavitha gain From KCR After Press Meet

శత్రువులు ఎక్కడో ఉండరు.. ఇంట్లో మనచుట్టూనే తిరుగుతూంటారని ఈ మధ్య వచ్చిన ఒక సినిమా డైలాగుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఈ మాట ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటుందని అనిపిస్తోంది. కేసీఆర్‌ కుమార్తె కవిత అంత పని చేశారు మరి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి, సీబీఐ విచారణ ప్రయత్నాలతోనే కేసీఆర్‌ సతమతమవుతున్న తరుణంలో ఉరుము లేని పిడుగు మాదిరి కవిత విరుచుకుపడ్డారు. నేరుగా ఏమీ అనకపోయినా, ఆమె వ్యాఖ్యలన్నిటికి కేసీఆర్‌ బాధ్యుడవుతారన్నది బహిరంగ రహస్యం. 

కవిత వైఖరి కొన్ని నెలలుగా పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. సోదరుడు పార్టీ వర్కింగ్‌ అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించడమే కాకుండా.. అధినేత కేసీఆర్‌ చుట్టూ దయ్యాలున్నాయంటూ దనుమాడిన సంగతి ప్రజలందరికీ తెలుసు. వీటన్నింటినీ ఓపికగా సహించిన కేసీఆర్‌ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్‌, బీజేపీలకు ఆయుధాన్నిచ్చేలా వ్యవహరించడంతో సహించలేకపోయారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కవిత కూడా పార్టీకి రాజీనామా చేసి ఒక రకంగా తండ్రితో బంధాలు తెంచుకున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, మాజీ మంత్రి హరీశ్‌ రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావులతోపాటు  ప్రముఖ కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిలపై కూడా కవిత ఆరోపణలు చేశారు. హరీశ్‌ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని, వీరిద్దరూ ఢిల్లీ నుంచి విమానంలో కలిసి వచ్చారని, ఆ సందర్భంలో రాజకీయాలు మాట్లాడుకున్నారని ఆమె అంటున్నారు. బీఆర్‌ఎస్‌లో కాని,ఆయా రాజకీయ వర్గాలలో కాని, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ సలహా, సంప్రదింపులతోనే కవిత తన సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. దానిని పూర్వపక్షం చేయడానికి ఆమె ప్రయత్నించినట్లు కనిపించినా, ఎవరూ పెద్దగా నమ్మకపోవచ్చు. తన తండ్రిపై సీబీఐ విచారణ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత?, పోతే ఎంత అని ప్రశ్నించడం ద్వారా ఆమె తన మనసులో మాట చెప్పారన్న  భావన కలుగుతుంది. 

కేసీఆర్‌పై అవినీతి మరక పడిందని కవిత కూడా చెప్పడం సహజంగానే బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతుంది.పైకి హరీశ్‌, సంతోష్‌ల గురించి ప్రస్తావించినా, వారు కేసీఆర్‌ను దెబ్బతీస్తారని అంటున్నా, ఆమె చేసే ప్రతి వ్యాఖ్య కేసీఆర్‌కు తగులుతుంది. కాకపోతే ఆమె నేరుగా ఈ మాట చెప్పకపోవచ్చు. ఈ మధ్య కాలంలో పార్టీకి దూరమైన కవిత ఇప్పుడు ఆ పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత అని ప్రశ్నించారు. దానికి తగిన విధంగా సస్పెన్షన్ తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీపై, తండ్రిపై గౌరవం ఉంటే అలా మాట్లాడగలిగేవారా?. 

అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం వివాదంపై మాజీ మంత్రి, కేసీఆర్‌ అల్లుడు హరీశ్‌రావు సమర్థంగా వాదించారన్న ఆనందం ఎంతో సేపు లేకుండా చేశారు కవిత తన వ్యాఖ్యలతో!. 

పోనీ ఆమె అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడారని అనుకున్నా, ఆమె పై కొంతకాలం క్రితం వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలు, కొద్ది నెలలపాటు జైలులో ఉన్న పరిస్థితి కూడా సహజంగానే చర్చకు వస్తాయి. కాళేశ్వరం దెబ్బతినడంతోపాటు, కవిత లిక్కర్ స్కామ్‌లో అరెస్టు  అవడం కూడా బీఆర్‌ఎస్‌ను ఎన్నికలలో  దెబ్బతీసిందన్నది చాలామంది భావన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర ఉందని ఏ బీఆర్‌ఎస్‌ నేత అయినా బహిరంగంగా అంటే ఒప్పుకుంటారా? 

కవిత చేసిన వ్యాఖ్యల గందరగోళాన్ని తగ్గించుకోవడానికి గాను  ఆమెపై చర్య తీసుకోక తప్పని స్థితి ఏర్పడిందన్నది పార్టీలో ఉన్న అభిప్రాయం. అలా చేయలేకపోతే హరీశ్‌ సంతోష్ వంటివారికి అసంతృప్తి కలగవచ్చు.  ఇప్పటికే కవిత దూరమైన నేపథ్యంలో వీరిని వదలుకునే పరిస్థితి ఉండదు. ఆమె తిరుగుబాటుకు  పార్టీలో  పెద్దగా అనుకూలత వచ్చినట్లు అనిపించదు. హరీశ్‌రావుకు పార్టీ అంతా అండగా ఉన్నట్లు  తేలింది. వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ ఒక వ్యాఖ్య చేస్తూ హరీశ్‌ను ఆరడగుల బుల్లెట్ అని, మాస్టర్ క్లాస్ అని అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రశంసించారు. ఇవన్ని కవితకు బీఆర్‌ఎస్‌ ఇచ్చిన సమాధానాలే అవుతాయి. 

కవిత తొలుత తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా, ఆ తర్వాత కాలంలో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కాని ఆ గెలుపును ఆమె నిలబెట్టుకోలేకపోయారు. నిజామాబాద్ లో మరోసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అయినా కేసీఆర్‌ ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వ్యవహార శైలిపై కొంతమందిలో అసంతృప్తి ఉన్నప్పటికి, ఎవరూ పైకి మాట్లాడేవారు కారు. ఇప్పుడు వారు కూడా హరీశ్‌రావు పార్టీకి మూల స్తంభాలలో ఒకరని  బదులు ఇస్తున్నారు. 

కొద్దికాలం క్రితం కవిత పై విమర్శలు చేయడానికి  మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాందీ కూడా పలికారు. కవిత సొంతంగా పార్టీ పెట్టుకుంటారా? లేక కాంగ్రెస్‌లో చేరతారా? అన్న చర్చకు ఆమె అవకాశం ఇస్తున్నారు. తనను అరెస్టు చేయించింది బీజేపీనే అన్న భావనలో ఉన్నందున ఆ పార్టీ వైపు వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌ సంక్షోభం వెనుక తమకు ఎలాంటి పాత్ర లేదని, అది అవినీతి సొమ్ము పంచాయతీ అని సమాధానం ఇచ్చారు. కవిత తనకు తెలిసిన అవినీతి సమాచారం అంతటిని సీబీఐకి ఇవ్వాలని బీజేపీ ఎంపీలు అరవింద్, రఘునందన్ వంటివారు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో గొడవలు ఆ రెండు పార్టీలకు సహజంగానే సంతోషం కలిగిస్తాయి. 

కవిత ఒకరకంగా తండ్రినే బ్లాక్ మెయిల్ చేసినట్లు కనిపిస్తోంది. పైకి ఆయనను గొప్పవాడుగా ప్రొజెక్టు చేసినట్లు అనిపించినా.. మొత్తం ఆయనను దృష్టిలో ఉంచుకుని చేశారన్న భావన కలుగుతుంది.  రేవంత్ ను ఉద్దేశించి కొంత అనుచిత వ్యాఖ్య చేసినట్లు  కనిపించినా, కవిత  తీరు  వల్ల కాంగ్రెస్ కు రాజకీయంగా లబ్ది చేకూరే అవకాశం ఉంది.  

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేస్తూ కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైందని వ్యాఖ్యానించారు.అందులో మామ వాటా ఎంతో అల్లుడి వాటా ఎంతో తేలాలి అని కూడా ఆయన అన్నారు. తనను కాంగ్రెస్, బీజేపీ, రేవంత్‌, బండి సంజయ్‌ నడిపిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే  ఖబడ్దార్ అని కవిత  హెచ్చరించారు. తాను ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదని, తనది కేసీఆర్‌ రక్తమని కవిత పేర్కొనడం బాగానే ఉన్నా,  ఏ లక్ష్యంతో ఆమె ఈ వివాదాన్ని సృష్టించారన్న దానిపై ఎవరికి వారు ఊహించుకుంటారు. చర్చించుకుంటారు. 

గతంలో ఆమె కేసీఆర్‌కు ఒక లేఖ రాసి పార్టీలో అసమ్మతికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు పార్టీకి దూరం అయ్యారు. కవిత  భవిష్యత్తు రాజకీయం అంత తేలికగా ఉండదు. ఒక పెద్ద పార్టీ నీడలో, అది కూడా సొంత పార్టీలో, తండ్రి చెంత ఉండడం వేరు. సొంతంగా పార్టీని పెట్టుకున్నా, మరో పార్టీలో చేరినా, అది  ముళ్లబాటే అవుతుంది. వాటన్నిటిని దాటుకుని కవిత  తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకుంటే అది గొప్ప విషయమే అవుతుంది. కాని చరిత్రలో అలా సఫలం అయిన ఘట్టాలు చాలా తక్కువే అని చెప్పాలి.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement