ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా మంటలు
మళ్లీ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఆశీర్వదించాలని పిలుపు
తాజాగా గీసుకొండ వేదికగా కొండా సుస్మితాపటేల్ ఘాటు వ్యాఖ్యలు
పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బరాబర్ బరిలో ఉంటానని స్పష్టం
తాను కూడా పోటీ చేస్తానని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి ప్రకటన
సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఇప్పుడే రాజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల పరకాల పర్యటనలో పిలుపునివ్వడం ఒకవైపు.. కొండా సుస్మితాపటేల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు మరోవైపు రాజకీయ వేడిని పెంచాయి.
ఇదే సమయంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి సైతం తాను లేదా తన సతీమణి పరకాల నుంచి బరిలో ఉంటామని చెప్పడంతో కాంగ్రెస్‌లో మూడు వర్గాల మధ్య పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికలకు ముందే మొదలైన ఈ టికెట్ పోరు.. రానున్న రోజుల్లో ఇంకా ముదిరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
గీసు‘కొండా’ కేంద్రంగానే..
2024 మే 8: గీసుకొండ కాంగ్రెస్ నాయకుడి వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఆడియో లీక్‌తో కలకలం.
2024 అక్టోబర్ 13: ధర్మారంలో దసరా ఫ్లెక్సీ వివాదం.. కొండా, రేవూరి వర్గాల మధ్య ఉద్రిక్తత, పోలీస్‌స్టేషన్‌లో హైటెన్షన్.
2025 డిసెంబర్: గీసుకొండ మండలంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో కొండా వర్గానికి 7, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గానికి 9 స్థానాలు వచ్చాయి.
2026 మార్చి 3: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో సుస్మితా పటేల్ పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననే సంకేతాలు.
2026 మార్చి 3: కొండా మురళి సైతం కుమార్తెకు మద్దతుగా కొండా కుటుంబాన్ని భవిష్యత్‌లోనూ గీసుకొండ ప్రజలు ఆశీర్వదించాలని పిలుపు.
2026 ఆగస్టు 19: గీసుకొండలో సుస్మితా పటేల్ సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. రేవూరి ప్రకాశ్‌రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా పరకాల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటన.


