సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ! | Kommineni Comments On Chandrababu Wealth Creation Campaign | Sakshi
Sakshi News home page

సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!

Apr 8 2025 10:26 AM | Updated on Apr 8 2025 11:28 AM

Kommineni Comments On Chandrababu Wealth Creation Campaign

ఏ దేశమైనా అభివృద్ది చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడం.. పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడడం! కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలిగిన వారికి మరింత సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దీన్నే అభివృద్ధి అనుకోమంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాల్‌ నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టడం చూస్తే ఈ ఆలోచనే వస్తుంది ఎవరికైనా. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు... అమరావతిని మాత్రం అప్పులు తెచ్చిమరీ నిర్మాణాలు చేపట్టి అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మరిన్ని డబ్బులు సంపాదించుకుంటే చాలన్నట్టుగా ఉండటం ఇంకో ఉదాహరణ.

ఎన్నికల సమయంలో సూపర్‌ సిక్స్‌ పేరుత పేదలను ఊరించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత వాటిని మూలన పడేశారు. బాబు గారికి వత్తాసు పలికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు హామీల ఊసే ఎత్తడం లేదు. లేని వారికి పైసా విదల్చని వీరిద్దరూ లూలూ మాల్‌కు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు వద్ద సుమారు 14 ఎకరాల భూమిని లూలూ మాల్‌కు కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తామన్న ఈ సంస్థ ప్రతిపాదనలకు ఊ కొట్టింది. కానీ ఆరేళ్లపాటు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడంతో 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.

వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావడం... లూలూ గ్రూప్ తెరపైకి వచ్చింది. మళ్లీ భూముల పందేరం జరిగిపోయింది. మాల్స్‌ వచ్చిన కొత్తలోనైతే వాటిని ప్రోత్సహించేందుకు భూమి ఇచ్చారంటే ఒక అర్థముంది. విశాఖ, విజయవాడల్లో ఇప్పటికే బోలెడన్ని మాల్స్‌ ఉన్నాయి. అది కూడా నగరానికి దూరంగా పార్కింగ్‌ తదితర సౌకర్యాలు కల్పించిన ఓకే అనుకోవచ్చు కానీ.. విశాఖ బీచ్‌ రోడ్‌లో స్థలమివ్వడమంటే...??? ఈ 14 ఎకరాల స్థలం విలువ రూ.1500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీనిని ఏకంగా 99 ఏళ్లకు లీజ్ కు ఇవ్వడం కూడా ఆశ్చర్యమే మరి!

వీటన్నింటికీ అదనంగా ఇంకో రూ.170 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మేళ్లన్నింటికీ లూలూ ప్రభుత్వానికి ఇచ్చేదెంత? నెలకు ముష్టి నాలుగు లక్షల చొప్పున ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే. ఇంకో విషయం.. లూలూ ఏమీ ఆషామాషీ కంపెనీ కాదు. కావాలనుకుంటే సొంతంగా భూములు కొనుక్కోగల ఆర్థిక స్థోమత ఉన్నదే. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ సంస్థ భారీ మాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదంతా లూలూ గ్రూపు సంపద మరింత పెంచేందుకే అన్నది లోగుట్టు!

లూలూ ఏమీ పరిశ్రమ కాదు. కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న, చిన్న వ్యాపారులంతా ఉపాధి కోల్పోయే అవకాశాలెక్కువ. పోనీ మాల్‌లో తక్కువ అద్దెకు షాపులిచ్చి సామాన్య దుకాణదారులను ఏదైనా ఆదుకుంటారా? అంటే అదీ లేదు. దుకాణాల అద్దెలపై ప్రభుత్వానికి నియంత్రణే లేదు. అందుకే శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం రూ.170 కోట్లతో ప్రభుత్వమే షాపింగ్‌ మాల్‌ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు.బీచ్ సమీపంలోని రిషికొండపై జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లూలూ గ్రూప్ కు ఇంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. 

అమరావతి విషయానికి వస్తే, గత ప్రభుత్వం అక్కడ పేదల కోసం ఇచ్చిన ఏభై వేల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు  కానీ అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. మరో వైపు సుమారు ఏభై వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేటతెల్లమైంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా, ధనికులు, బడా భూ స్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చి, వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోంది.

రాజధాని పనుల టెండర్లు తమకు కావల్సినవారికి కేటాయించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, సిండికేట్ల ద్వారా కథ నడిపించడంపై విమర్శపూర్వక వార్తలు వస్తున్నా, ప్రభుత్వం అసలు  పట్టించుకోవడం లేదు. కనీసం అందులో వాస్తవం లేదని చెప్పే  యత్నం చేయడం లేదంటే  ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, పది లక్షల కోట్ల పెట్టుబడులు అని, ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దానిని బ్యానర్‌ కథనాలుగా వండి వార్చారు.

ఇలాంటివన్నీ కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీ విద్యార్థులకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతికి తరలి వస్తాయని అంటున్నారు. అమరావతి గ్రామాలలో రూ.138 కోట్లతో 14 స్కూళ్లు, 17 అంగన్ వాడీలు, 16 వెల్‌ నెస్ సెంటర్లను ఆధునికంగా తయారు చేస్తోందని ఎల్లో మీడియా బాకా ఊదింది. మరి ఇదే విధంగా మిగిలిన రాష్ట్రం అంతటా ఎందుకు ఏర్పాటు చేయరు? గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ప్రాంతం అన్న తేడా లేకుండా స్కూళ్లను, ఆస్పత్రులను బాగు చేస్తే  దానిపై విష ప్రచారం చేసిన ఈ మీడియాకు ఇప్పుడు అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే  బడాబాబులకే  అన్న సంగతి పదే, పదే అర్థమవుతోందన్నమాట!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement