Putta Madhu: అదే జరిగితే పెద్దపల్లి జెడ్పీ కుర్చీ ఆమెకే..?!

Kandula Sandhya Rani Has Chances To Become Peddapalli ZP Chairman - Sakshi

కందుల సంధ్యారాణికి అవకాశం..!

మంథని: న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు పాత్రపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ పీఠంపై పలువురు కన్ను పడింది. మొదటి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా తామంటే తాము అవుతామని ఊహల లోకంలో తేలినవారికి స్వయానా సీఎం కేసీఆర్‌ పుట్ట మధు పేరు ప్రస్తావించడంతో మిన్నకుండిపోయారు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మధు పోలీసుల అదుపులో ఉండడంతో ఆయన పదవికి గండం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రస్తుతం పుట్ట మధును పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే జరిగితే మధు చైర్మన్‌ పదవి ఊడుతుందని, ఆ స్థానంలో తాము సిద్ధంగా ఉన్నామని పలువురు జెడ్పీటీసీలు అధిష్టానం ఎదుట బారులు తీరినట్లు సమాచారం. వీరిలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మొదటి నుంచి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. అటు మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మద్దతుతో జెడ్పీ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమెతోపాటు జిల్లాలోని మరో ముగ్గురు జెడ్పీటీసీలు సైతం చైర్మన్‌గిరి కోసం పోటీ పడుతున్నారు. పుట్ట మధును పోలీసులు విచారిస్తున్నా.. ఇప్పటివరకు ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయినా మధు పదవి ఎలాగైనా పోతుందనే ముందస్తు సమాచారంతో జెడ్పీటీసీలు చైర్మన్‌ గిరి కోసం పోటీ పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

చదవండి: Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్‌..!  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top