
మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు సీఎం కావడం దురదృష్టకరం: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు. ప్రజా సంక్షేమంలో లాభనష్టాలు చూసుకోరు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునే వారు వ్యాపారులవుతారు గానీ పాలకులు కారు. మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం’అని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
వంద శాతం జనావాసాలకు నిరంతరం సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ‘మిషన్ భగీరథ’ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదని,దండగని రేవంత్ మాట్లాడటం శోచనీయమన్నారు. మిషన్ భగీరథ కోసం గత ప్రభుత్వం రూ. 35 వేల కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని రూ.50 వేల కోట్లకుపెంచి చెబుతున్న ఘనత రేవంత్‌కే దక్కుతుందన్నారు.
మిషన్ భగీరథపై అవగాహన లేదు
‘మిషన్ భగీరథ పథకం లక్ష్యంపై సీఎం అనే వ్యక్తికి కనీసం అవగాహన లేదు. మిషన్ భగీరథ ప్రజల ఆరోగ్యం కాపాడిన గొప్ప సంజీవనిగా చూడాలి. లాభనష్టాలు బేరీజు వేసుకోవడం తగదు. రైతులకు సాగునీరు ఇవ్వడాన్ని, ప్రజలకు మంచినీరు ఇవ్వడాన్ని కూడా లాభనష్టాలతో బేరీజు వేసుకునే ప్రభుత్వం ఒకటి వస్తుందని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించి ఉండరు. బీడు భూముల్లో సిరులు పండుతుంటే రైతులు పడే సంతోషం చూడాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వంతో లాభనష్టాలు చూడొద్దని కోరుతున్నా.
ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటివి కూడా లాభం లేని పథకాలుగా భావించి రద్దు చేస్తారా’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తరచూ తన ఎత్తు గురించి మాట్లాడుతున్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రజల కోసం ఎవరెంత ఆలోచిస్తున్నారో, ఎవరెంత పనిచేస్తున్నారో మాత్రమే అవసరమన్నారు. ‘హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది.
అధికారంలోకి రాగానే, ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పి ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలాంటి ఫీజు లేకుండా అమలు చేయాలి.. లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’అని హరీశ్ పేర్కొన్నారు.