బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పాతిపెడతాం 

Former MP Ponguleti Fire in Khammam Atmiya Sammelanam - Sakshi

తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్‌ వేలకోట్లు దోచుకున్నారు 

ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎంపీ పొంగులేటి ఫైర్‌ 

ఎన్నికలు రాగానే బీసీలు గుర్తుకొచ్చారా అని ప్రశ్న 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘ఏ ఆశయం కోసం తెలంగాణ బిడ్డలు కలలు గన్నారో అవి నెరవేరలేదు. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్‌ వేలకోట్లు దోచుకుని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఇక తెలంగాణ బిడ్డలు ఉపేక్షించరు. బీఆర్‌ఎస్‌ పా ర్టీ తోపాటు ప్రభుత్వాన్ని గొయ్యి తీసి పాతిపెట్టడం ఖాయం’’ అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఖమ్మంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల సూచనలు, దీవెనలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని సమాధి చేస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ప్రజల తీర్పు ముందు బీఆర్‌ఎస్‌ తలవంచక తప్పదన్నారు. కుట్రలు, కుతంత్రాలతో సీఎం కేసీఆర్‌ మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం అని కేబినెట్‌ ప్రకటించడం మాటల గారడీ అన్నారు.

గత తొమ్మిదేళ్లలో గుర్తుకురాని బీసీలు ఎన్నికల వేళ గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. మంత్రులే పేపర్లు లీక్‌ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న భూములను కొల్లగొట్టడానికి, వేలకోట్లు సంపాదించడానికే కేసీఆర్‌ ధరణిని తెచ్చారని విమర్శించారు. ఖమ్మంకు చెందిన మంత్రి దోపిడీ అందరికీ తెలుసని, ఆయన అనుచరులు మట్టికొండలను సైతం వదిలిపెట్టడం లేదని ఆరోపించారు. 

మార్పునకు ఈ సభ సంకేతం: కోదండరామ్‌ 
తెలంగాణలో నెలకొన్న సంక్షోభం నుంచి ప్రజలు పరిష్కారం కోరుకుంటున్నారనడానికి ఖమ్మం సభ ఒక సంకేతమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ పేర్కొన్నారు. ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవలి అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన సర్కార్‌.. ఇప్పటివరకు ఇవ్వలేదేమని నిలదీశారు. తెలంగాణను కాపాడుకోవడానికి అంతా ఒకతాటిపైకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. 

మరో ఉద్యమానికి సిద్ధం కావాలి: జూపల్లి 
వందలాది మంది యువత బలిదానాలతో వచ్చిన తెలంగాణలో నిరంకుశ పాలన నెలకొందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణ పరిరక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో భద్రాద్రి జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పిడమర్తి రవి, వైరా మున్సిపల్‌ చైర్మన్‌ సుతకాని జైపాల్, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top