రణరంగం ముగిసింది.. తీర్పే మిగిలింది..

Election Campaign Completed For Dubbaka Bye Election Voting November 3rd - Sakshi

దుబ్బాకలో ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం

ఎల్లుండి పోలింగ్‌, నవంబర్‌ 10న ఫలితం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార  రణరంగం ముగిసింది. ఓటర్ల  తీర్పు మాత్రమే మిగిలివుంది. చెదురుమదురు సంఘటనలు మినహా ఆదివారం సాయంత్రం అయిదు గంటలతో  ఎన్నికల  ప్రచారం  ప్రశాంతంగా ముగిసింది. దుబ్బాక  అసెంబ్లీ ఉప ఎన్నికకు  జోరుగా సాగిన ప్రచారం,  నాయకుల ఉపన్యాసాలు, డప్పు చప్పుళ్లు, ఊరేగింపులు, మైక్ శబ్దాలు, అభ్యర్థుల హామీలు, వాగ్దానాలు మాటల తూటాల ప్రచార  పర్వం ముగిసింది .  జోరు వాన కురిసి వెలిసినట్లు పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో  సమాప్తం అయింది. (చదవండి : రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్‌)

లక్షా 98 వేల ఓటర్లు ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు, స్వతంత్ర  పార్టీల అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.  తాము గెలుస్తామని ఒకరు, తామే గెలుస్తామని మరొకరు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. తమని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని పరిగెత్తిస్తామని అధికార టీఆర్‌ఎస్‌, తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సిద్దిపేట, గజ్వేల్ తరహాలో అభివృద్ధి చేస్తామని బీజేపీ, తమకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని కాంగ్రెస్, ఇలా ఎవరికి వారే ప్రచారం కొనసాగిస్తూ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలను కలియతిరిగారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న అకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు, కాంగ్రెస్ తరపున దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలోకి ఉన్నారు.  మొత్తం దుబ్బాక బరిలో 23 మంది పోటీ చేస్తున్నారు. అన్ని ప్రధాన పార్టీల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రధాన నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. దుబ్బాక నియోజక వర్గానికి అధికార పార్టీ చేసిన నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించాయి. (చదవండి : 'బీజేపీ అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తోంది')

ఒక రకంగా చెప్పాలంటే దుబ్బాక ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. ఉప ఎన్నికలలో  తమ పార్టీ  అభ్యర్థి  గెలుపొందాలని రాష్ట్ర,కేంద్ర  స్థాయిలోని  పార్టీ  ముఖ్య నేతలు ప్రచారాన్ని నిర్వహించి ఎవరికి వారే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  దుబ్బాక  ఉప ఎన్నికను  ప్రతిష్టాత్మకంగా  తీసుకున్న మంత్రి హరీష్ రావు,  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు  పరిస్థితిని  సమీక్షిస్తూ  ప్రచార సరళిని పర్యవేక్షించారు.

ఇక బీజేపీ తరఫున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్,  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్,  గోషామహల్  ఎమ్మెల్యే రాజా సింగ్, డీకే అరుణ  ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్  తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ  రేవంత్ రెడ్డి, పొన్నాం  ప్రభాకర్, హనుమంత రావు, గీతరెడ్డి, దామోదర్  రాజనర్సింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. (చదవండి : రఘునందన్‌రావు బావమరిది అరెస్ట్)‌

అయితే సిద్దిపేటలో సోమవారం (23వ తేదీ) జరిగిన నోట్ల కట్టల లొల్లి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బీజేపీ– టీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.టీఆర్‌ఎస్‌ ప్రోద్బలంతో పోలీసులే డబ్బు తెచ్చిపెట్టి తమను ఇరికించే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపిస్తే, డబ్బులతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, కపట నాటకాలాడు తోందని టీఆర్‌ఎస్‌ ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఆగడాలను అడ్డుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌ను బీజేపీ ఆశ్రయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి ఒక ఐఏఎస్ అధికారిని కూడా ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. 

మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కేవలం తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్‌లో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్న విషయం నవంబర్ 10న తేట తెల్లం కానుంది.

హోరా హోరీగా సాగిన ఉప ఎన్నిక ప్రచారం

  • సోలిపేట సుజాత (టీఆర్‌ఎస్‌)
  • రఘునందన్‌ రావు (బీజేపీ)
  • చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్)
  • ఎల్లుండి దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌, 10న ఫలితాలు
  • దుబ్బాక ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
  • ఎన్నికల విధుల్లో 2వేల మంది పోలీస్ సిబ్బంది
  • ఈనెల 4 వరకు దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్
  • దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలు
  • దుబ్బాక నియోజకవర్గంలో 89 సమస్యాత్మక ప్రాంతాలు
  • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ఏర్పాట్లు
  • ఒక్కో కేంద్రానికి వెయ్యి మంది ఓటర్లు
  • వృద్ధులు, దివ్యాంగులు, కరోనా రోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
     
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top