
2024 లోక్‌సభ ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో ఈనెల 4న వెలువడబోయే ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మనకు టీవీల్లో లేదా స్మార్ట్‌ఫోన్‌లలో ఎన్నికల ఫలితాలను చూసే అవకాశం ఉంది. అయితే ఒకప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిచారో తెలుసుకునేందుకు మరుసటి రోజు వచ్చే వార్తాపత్రికల కోసం వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ‘సత్యం శివం సుందరం’ నినాదంతో మనముందుకొచ్చిన దూరదర్శన్ ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు మరుసటి రోజు వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేసింది.
1971 ఎన్నికల ఫలితాలు దూరదర్శన్‌లో మొదటిసారి ప్రసారమయ్యాయి. నాటి ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగాయి. దీనికి కారణం అప్పటివరకూ ఐక్యంగా ఉన్న కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. దీంతో ఫలితాలపై దేశ ప్రజలకు ఎక్కడలేని ఆసక్తి ఏర్పడింది. నాటి ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిల మరణానంతరం విచ్ఛిన్నమైంది. నాటి నేత కామరాజ్ నాయకత్వంలో కాంగ్రెస్ (ఓ), ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ (ఐ) ఏర్పడ్డాయి. ఎన్నికల ఫలితాలు ఇందిరా గాంధీ వర్గంలోని కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. భారీ మెజారిటీతో ఇందిరా గాంధీ ప్రధాని అయ్యారు.
దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. తొలినాళ్లలో మన దేశంలో టీవీని కొనుగోలు చేయడం సంపన్న కుటుంబాలకే పరిమితమయ్యింది. తరువాత టీవీలు క్రమక్రమంగా ప్రజలకు చేరువయ్యాయి. 1970 నాటికి ప్రభుత్వ కార్యక్రమాలను దూరదర్శన్ ముమ్మరంగా ప్రసారం చేయడం ప్రారంభించింది. అలాగే భారతదేశంలోని విస్తృత ఎన్నికల రంగంలోకి ప్రవేశించింది. 1971 ఎన్నికల ఫలితాలు దూరద్శన్‌లో ప్రసారమైనప్పుడు జనం ఎంతో ఆసక్తిగా గమనించారు.