TS: సైలెంట్‌ అయిన బీజేపీ నేతలు.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఇదే?

Delhi Leaders Key Orders Over Telangana BJP Leaders - Sakshi

తెలంగాణ కాషాయ సేన రివర్స్ గేర్లో వెళుతోందా? రాష్ట్ర ప్రభుత్వం మీద పోరుకు సిద్ధమైన పార్టీ ఎందుకు వెనకడుగు వేసింది? గులాబీ సేనపై దాడికి ఎందుకు సంకోచిస్తోంది? టీబీజేపీకి ఢిల్లీ పెద్దలు ఇచ్చిన డైరెక్షన్  ఏంటి? అసలు తెలంగాణ కమలం పార్టీ ఆలోచన ఏంటి?..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అధికారం కాపాడుకోవాలని బీఆర్ఎస్, పీఠం ఎక్కాలని కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమలదళం స్వరం మారుతోందనే ప్రచారం మొదలైంది. ముందుగా ప్రకటించినట్లుగా కేసీఆర్ సర్కార్‌పై రివర్స్ అటాకింగ్ ప్రోగ్సామ్స్ నిర్వహించకుండా వాటికి పుల్ స్టాప్ పెట్టింది. కేవలం మోదీ ప్రభుత్వ అభివృద్ధి మంత్రంతోనే జనాల్లోకి వెళ్లాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దల నుంచి ఆర్డర్స్ అందాయని సమాచారం. ఈ కార్యక్రమాల ద్వారా పార్టీ మీద ప్రజల నుంచి నెగిటివ్ ప్రభావం లేకుండా చూసుకోవాలని కూడా అధిష్టానం సూచించిందట. జన సంపర్క్ అభియాన్ మినహా మిగతా కార్యక్రమాలు ఏవీ పెట్టుకోవద్దని బీజేపీ అగ్రనాయకులు రాష్ట్ర నేతలకు స్ట్రిక్ట్ గా చెప్పేశారట.  

తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పాటు వివిధ శాఖలు సాధించిన విజయాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాలను అధికారంలో ఉన్న గులాబీ పార్టీ వాడుకునే ప్రయత్నం చేస్తోందని.. గులాబీ పార్టీ మీద కౌంటర్ ఎటాక్ చేసేందుకు వీలుగా తెలంగాణ బీజేపీ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. అయితే బీఆర్ఎస్ మీద రివర్స్ ఎటాక్ చేసే కార్యక్రమాలకు బీజేపీ పార్టీ హైకమాండ్ నో చెప్పడంతో ..  ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రెస్ మీట్స్‌తోనే రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టాలని రాష్ట్ర నాయకులకు పార్టీ అధిష్టానం సూచించిందట.

బీజేపీ.. బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్‌కు వ్యతిరేకంగా కాషాయ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను రద్దు చేసుకోవడం చర్చకు దారితీసింది. కమలనాథులు మాత్రం జన సంపర్క్ అభియాన్ తర్వాత మళ్లీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగిస్తామని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్‌పై తమ పోరాటం ఆగదని ఎన్నికల వరకు సాగుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పార్టీలో చేరికపై రేపు పొంగులేటి కీలక ప్రకటన!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top