హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మితా పటేల్‌ను అదుపులో పెట్టుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు సూచించారు. బిడ్డను అదుపు చేయకుంటే మంత్రి పదవికి ముప్పు తప్పదని హెచ్చరించారు. గాంధీభవన్‌లో గురువారం కల్వ సుజాత, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజా రేణుక, ఇందిరా శోభన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండా సురేఖ పేరును సుస్మిత దిగజారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సుస్మితకు హితవు పలికారు.
కొండా సురేఖను చూస్తే జాలేస్తోంది
కూతురు వ్యాఖ్యలతో మంత్రి సురేఖ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ మహిళా నేత కల్వ సుజాత అన్నారు. కొండా సురేఖను చూస్తే జాలేస్తోంది. బిడ్డ చేసిన పనికి ఆమె ఇబ్బంది పడుతోంది. సుస్మితకి కాంగ్రెస్ సభ్యత్వం కూడా లేదు. ఆమె ఇండియాలో 15 రోజులు ఉంటే 15 రోజులు అమెరికాలో ఉంటుంది. సుస్మితకి ఆసక్తి ఉంటే పరకాలలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయొచ్చు. టికెట్ల కేటాయింపుతో సుస్మితకి ఏం సంబంధం? రేవంత్ తన మేనమామ అని సుస్మిత చెబుతోంది.. మేనమామని ఇష్టమున్నట్టు తిడతారా? అని కల్వ సుజాత నిలదీశారు.
సురేఖ తన కూతురిని అదుపులో పెట్టుకోవాలి
సుస్మితపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కోరుతున్నామని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజా రేణుక తెలిపారు. కొండా సురేఖ తన కూతురిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సుస్మిత పటేల్ ఇంకా తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉందని అనుకుంటుంది. సుస్మిత కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా? ఇంకోసారి రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. సుస్మిత ముందు వార్డు మెంబర్‌గా గెలవాలి. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి ఆమెకు లేదు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే ఇక్కడ నడవదని రేణుక అన్నారు.
చదవండి: సుస్మిత వల్ల సురేఖ తలదించుకోవాల్సి వస్తోంది


