వరంగల్‌కు అరూరి.. | Sakshi
Sakshi News home page

వరంగల్‌కు అరూరి..

Published Mon, Mar 25 2024 4:16 AM

BJP names candidates for 17 LS seats in Telangana - Sakshi

ఖమ్మం తాండ్ర వినోద్‌ తెలంగాణలో అన్ని లోక్‌సభ స్థానాలకు 

బీజేపీ అభ్యర్థుల ప్రకటన పూర్తి 

సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల ఎంపికతో తెలంగాణలో బీజేపీ 17 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించినట్టు అయ్యింది. ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం ఆదివారం రాత్రి మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను వరంగల్‌ నుంచి, తాండ్ర వినోద్‌రావును ఖమ్మం నుంచి బరిలో దించింది. ఖమ్మం నుంచి వినోద్‌రావు పేరు మొదట్లో పరిశీలనకు వచ్చినా, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరావులలో ఒకరికి బీజేపీ టికెట్‌ ఇస్తుందని ప్రచారం జరిగింది.

ఆ దిశగా జరిగిన పలు పరిణామాలు ఆ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. అయితే అనూహ్యంగా  తాండ్ర వినోద్‌రావు     అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. 17 స్థానాల్లో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలను మినహాయిస్తే మిగతా 12 స్థానాల్లో ఐదు బీసీ, నాలుగు రెడ్డి, రెండు వెలమ, ఒక బ్రాహ్మణ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. అయితే ఎస్సీలకు సంబంధించిన మూడు రిజర్వుడ్‌ స్థానాలను మాదిగ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ తెలిపింది.

ఆయా లోక్‌సభ సెగ్మెంట్‌లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు వీరే.... 

  • ఆదిలాబాద్‌: గోడం నగేష్‌ (ఎస్టీ గోండు)
  • పెద్దపల్లి: గోమాస శ్రీనివాస్‌ (ఎస్సీ మాదిగ)
  • కరీంనగర్‌: బండి సంజయ్‌ కుమార్‌  (మున్నూరు కాపు)
  • నిజామాబాద్‌: ధర్మపురి అర్వింద్‌ (మున్నూరు కాపు)
  • జహీరాబాద్‌: బీబీ పాటిల్‌ (లింగాయత్‌)
  •  మెదక్‌ : రఘునందన్‌రావు (వెలమ)
  • మల్కాజ్‌గిరి: ఈటల రాజేందర్‌ (ముదిరాజ్‌)
  •  సికింద్రాబాద్‌: జి.కిషన్‌రెడ్డి (రెడ్డి),
  • హైదరాబాద్‌: మాధవీలత (బ్రాహ్మణ),
  • చేవెళ్ల: విశ్వేశ్వర్‌ రెడ్డి (రెడ్డి),
  • మహబూబ్‌నగర్‌: డీకే అరుణ (రెడ్డి),
  • నాగర్‌కర్నూల్‌: పి.భరత్‌ (ఎస్సీ మాదిగ),
  • నల్గొండ: సైదిరెడ్డి (రెడ్డి),
  • భువనగిరి: బూర నర్సయ్యగౌడ్‌ (గౌడ్‌),
  • వరంగల్‌: అరూరి రమేశ్‌ (ఎస్సీ మాదిగ),
  • మహబూబాబాద్‌: సీతారాం నాయక్‌ (ఎస్టీ లంబాడా),
  • ఖమ్మం: తాండ్ర వినోద్‌ రావు (వెలమ)    

Advertisement
Advertisement