
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే విషం చిమ్ముతున్నారరంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మోదీ తన పాలనలో చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా ఖర్గే జీ.. అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు లక్ష్మణ్,
‘మోదీ పదకొండు ఏళ్ల పాలనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్ముతున్నారు. ప్రపంచంలో పదవ స్థానంలో ఉన్న భారత్ ను మోదీ నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేశారు. మోదీ విధానాలు, కులం, వస్త్రాలపై రాహుల్ గాంధీ అవహేళన చేశారు. స్టాండప్, స్టార్టప్, మేక్ ఇన్ ఇండియాగా మోదీ తీర్చిదిద్దారు. ఉద్యోగాలు ఇవ్వడమే కాదు.. ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలుగా యువతను తీర్చిదిద్దారు. జాతీయ రహదారులు, రైల్వే, వైమానిక రంగాలను అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ పాలన కన్నా వంద రెట్ల అభివృద్ధి మోదీ చేసి చూపించారు. నకిలీ విత్తనాలు అరికట్టి, కనీస మద్దతు ధరలు, సబ్సిడీలు మోదీ ప్రభుత్వం కల్పించింది. ఇది అచ్చేదిన్ కాదా ఖర్గే చెప్పాలి.
ఓబీసీలపైన రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. మోదీ గ్లోబల్ లీడర్ గా ఎదిగారు.. ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో మోదీ తరహాలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పారా?, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ దేశ రక్షణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మల్లిఖార్జున్ ఖర్గే వాస్తవాలు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి డిల్లీలో మూడు రోజులు పడిగాపులు కాశారు. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాలు, వారసత్వ రాజకీయాల వల్లే బీఆర్ఎస్ లో కొట్లాట. బీజేపీ వెన్నుపోటు రాజకీయాలు చేయదు. ఆయుదాలు చేతిలో పట్టుకొని చర్చలు అంటే ఎట్లా?, ఆపరేషన్ సిందూర్ ను విమర్శిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు’ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు.