రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ: పార్టీ చిహ్నంగా సైకిల్‌ గుర్తు!?

Bicycle Symbol Going To Be Crucial In Rajinikanth Political Journey - Sakshi

మూడు వర్ణాలతో జెండా  

అన్నయ్య యాగం 

ముఖ్యులు రానున్నట్టు ప్రకటన 

సాక్షి, చెన్నై: తలైవా రజనీకాంత్‌ రాజకీయ పయనంలో సైకిల్‌ చిహ్నం కీలకం కానుంది. ఈ చిహ్నం ఆయనకు దక్కేనా అన్నది పక్కన పెడితే, అన్నామలై చిత్రం గెటప్‌ను తలపించే విధంగా సైకిల్, పాల క్యాన్‌తో రజనీ స్టైల్‌ను రాజకీయ చిహ్నంగా ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. మూడు వర్ణాలతో పార్టీ జెండా సిద్ధం అవుతోంది. తమ్ముడి కోసం అన్నయ్య సత్యనారాయణ తిరువణ్ణామలైలో గురువారం యాగాది పూజలు నిర్వహించారు.  

రజనీకాంత్‌ రాజకీయ ప్రకటన సమయం ఆసన్నం అవుతోంది. ఇందుకు 20 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో పార్టీ పేరు, చిహ్నం, జెండా విషయంగా సుదీర్ఘంగా సమాలోచన సాగునుంది. గురువారం పార్టీ ముఖ్యులు అర్జున్‌మూర్తి, తమిళరివి మణియన్‌ మక్కల్‌ మండ్రం జిల్లాల కార్యదర్శులతో భేటీ అయ్యారు. గంటల తరబడి ఈ భేటీ సాగడంతో ప్రాధాన్యత పెరిగింది. పార్టీ పేరును అత్యంత రహ్యంగా ఉంచేందుకు నిర్ణయించినా, చిహ్నం, జెండా విషయంగా లీకులు బయటకు వచ్చాయి. ప్రజల్ని ఆకర్షించే రీతిలో మూడు వర్ణాలతో రజనీ పార్టీ జెండా రూపుదిద్దుకోబోతోంది. ఆయా వర్ణాలతో జెండా రూపురేఖల నమూనా సిద్ధం చేసి, రజనీ వద్దకు తీసుకెళ్లేందుకు సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.  చదవండి: (రజనీ వెనుక కాషాయం!)

పార్టీ చిహ్నంగా సైకిల్‌ను ఎంచుకునేందుకు సిద్ధమైనట్టు చర్చ.  సైకిల్‌ చిహ్నం విషయంగా ఏదేని అభ్యంతరాలు, వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండవచ్చన్న భావనతో అందుకు కొన్ని మెరుగులుదిద్దారు. రజనీ నటించిన అన్నామలై చిత్రంలో సైకిల్, పాల క్యాన్‌ గెటప్‌ అభిమానుల్ని అలరించింది. ప్రస్తుతం ఇదే ఆ పార్టీకి చిహ్నంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైకిల్, పాలక్యాన్‌తో రజనీ గెటప్‌ తరహాలో చిహ్నంపై దృష్టిపెట్టినట్టు తెలిసింది. మక్కల్‌ మండ్రం నిర్వాహకులు జెండా, చిహ్నం విషయంగా తమ అంగీకారం తెలిపినా, తుది నిర్ణయం రజనీకాంత్‌ తీసుకోవాల్సి ఉందని ఆ మండ్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు.  

అన్నయ్య పూజలు.. 
రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణ గురువారం తిరువణ్ణామలైకు వెళ్లారు. అయ్యన్‌ కోనేరు ఒడ్డున ఉన్న అరుణ గిరినాథర్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యాగం, హోమాది పూజలు నిర్వహించినానంతరం మీడియాతో సత్యనారాయణ మాట్లాడారు. రజనీకాంత్‌ 31వ తేదీ రాజకీయ పార్టీ ప్రకటన చేయడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. ఆయన పార్టీలోకి ముఖ్యులు రాబోతున్నారని తెలిపారు. తిరువణ్ణామలైలో రజనీ పోటీ చేయాలని ఆనందమేనని, అది దేవుడి చేతిలో ఉందన్నారు. ఆథ్యాత్మికతను నమ్మని ద్రవిడ పార్టీలకు చివరి గడియలు సమీపిస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top