ఏపీ టీడీపీ: సర్దుకుంటున్న సీనియర్లు..! | Sakshi
Sakshi News home page

ఏపీ టీడీపీ: సర్దుకుంటున్న సీనియర్లు..!

Published Mon, Jun 21 2021 9:09 AM

AP TDP Senior Leaders Faraway From Politics - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాదరణ కోల్పోయి సోషల్‌ మీడియా, అనుకూల మీడియాకు పరిమితమైన టీడీపీ నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటోంది. వరుసగా ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ సీనియర్‌ నాయకులు చాలావరకూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దీర్ఘకాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోటలు బీటలు వారడంతో నాయకుల్లో తీవ్ర నైరాశ్యం, అభద్రతా భావం నెలకొంది. తిరుపతి ఉప ఎన్నికలో సైతం ఓటమితో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం ఆవరించింది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ జూమ్, సోషల్‌ మీడియాలో హడావుడి చేయడమే కానీ తమ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని పలువురు టీడీపీ నేతలు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.

చేతులెత్తేసిన సీనియర్లు..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ముఖ్య నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. పార్టీ బాధ్యతలను మోసేందుకు మాజీ మంత్రులు ఎవరూ ముందుకు రాకపోవడంతో జూనియర్లు, బయట పార్టీల నుంచి వచ్చిన వారిని పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులుగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏలూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల్ని ఇటీవల ప్రకటించారు. చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు లాంటి సీనియర్‌ నాయకులు చేతులెత్తేయడంతో వీరాంజనేయులుకు బాధ్యతలు అప్పగించారు.

విజయవాడ, గుంటూరు పార్లమెంటు జిల్లాలకు నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్‌కుమార్‌లను అధ్యక్షులుగా చేశారు. నెట్టెం రఘురాం చాలా ఏళ్ల నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత ఉదయభానుని ఢీకొట్టే సత్తాలేక కాంగ్రెస్‌ నుంచి శ్రీరాం తాతయ్యను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అప్పగించారు. గుంటూరులో పత్తిపాటి పుల్లారావు, రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌ లాంటి చాలామంది సీనియర్లున్నా శ్రావణ్‌కి బాధ్యతలు ఇచ్చి సరిపెట్టుకున్నారు. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపు అన్ని పార్లమెంటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

నియోజకవర్గాల్లో కానరాని నేతలు..
మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిల వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. దాదాపు 100కిపైగా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు చురుగ్గా లేరని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఏ కార్యక్రమం తలపెట్టినా స్పందన లేదని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. చాలామంది ఇన్‌ఛార్జిలు నియోజకవర్గాల్లో క్యాడర్‌కే అందుబాటులో లేరు. పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, కేఈ కృష్ణమూర్తి లాంటి సీనియర్లు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జి ఎవరో ఇంతవరకూ స్పష్టత లేదు. నూజివీడు, గన్నవరం, పామర్రు, ఏలూరు, పోలవరం లాంటి పలు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది.


 

Advertisement
Advertisement