‘వైఎస్‌ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’

Ambati Rambabu Slams Chandrababu Over His Manifesto - Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చింది మేనిఫెస్టో అయితే చంద్రబాబు ప్రవేశపెట్టింది మోసఫెస్టోనని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని అన్నారు. మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే సిగ్గేస్తోందని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఎంతమంది పేదలను దనవంతులుగా చేశాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వాగ్ధానాలు చేసి మోసగించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టో.. చంద్రబాబు మోసఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని అన్నారు.

గుంటూరు జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్థికరంగ విశ్లేషకులు పాపారావు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, యేసు రత్నం, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

ఈ మేరకు ఆదివారం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో సీఎం జగన్‌ ట్రెండ్‌ సెట్టర్‌. ఆయన పాలన ప్రజలకు స్వర్గం.. బాబు, ఎల్లో మీడియాకు నరకం. రాజకీయ నాయకులు భష్టు పట్టించిన మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చిన వ్యక్తి సీఎ జగన్‌. జగన్ మోహన్ రెడ్డి రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. అందులో పేర్కొన్నట్లే సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు ఇస్తున్నాం. మీకు మేలు చేస్తేనే ఓటేయమని అడుగుతున్నాం.  పేదలకు మేలు చేస్తే ఓటేయండి...లేకపోతే వద్దని దమ్ముగా చెప్పిన ఒకే ఒక్కడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి’ అని అంబటి వ్యాఖ్యానించారు.
చదవండి: ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు: మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

టీడీపీ కుట్రలను బహిర్గతం: డొక్కా మాణిక్య వరప్రసాద్‌
చెప్పిన ప్రతి అంశాన్ని అమలు పరచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ  డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే బైబిలు, ఖురాన్, భగవద్గీత అని ముఖ్యమంత్రి అన్నారని.. అందుకే మేనిఫెస్టో అంటే జగన్‌దేనని అన్నారు. ప్రజలను మోసపూరిత మాటలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలోని ప్రజలకు నిజానిజాలు తెలిపి టీడీపీ కుట్రలను బహిర్గతం చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు చించేశారు:  ఎమ్మెల్సీఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
‘రాజకీయ పార్టీలు తాము గెలిచిన తరువాత ప్రజలకు చేయబోయే పథకాలను తెలియజేస్తారు.కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో గెలిచిన తరువాత చించుతున్నారు. గతంలో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు చెక్ చేస్తే అప్పటికే దానిని చించారని గుర్తించారు. వైఎస్సార్‌సీపీ తీసుకు వచ్చిన మేనిఫెస్టోను నాయకుల ముందు ఉంచి ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించి 98 శాతం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్’ 

మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు: కొమ్మినేని శ్రీనివాసరావు
గతంలో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి కూడా అమలు కాలేదని, 2019లో వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశం అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొమ్మినేని దుయ్యబట్టారు.

‘‘మేనిఫెస్టోను భగద్గీత,ఖురాన్,బైబిల్ గా భావించిన వ్యక్తి సీఎం జగన్‌. మేనిఫెస్టో అంటే సీఎం జగన్‌ దృష్టిలో ప్రజలకు ఇచ్చిన హామీ. మేనిఫెస్టో అంటే చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే ఓ కాగితం. దేశమంటే మట్టికాదోయ్.. మనుషులోయ్ అన్నారు గురజాడ.. ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి  వైఎస్‌ జగన్‌. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారు. సోనియా గాంధీని ఎదిరించి సీఎం జగన్‌ ఎన్నో ఇబ్బందులు పడ్డారు’’ అని కొమ్మినేని అన్నారు.

చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప: ఆర్ధిక రంగ విశ్లేషకులు పాపారావు
వైఎస్‌ జగన్ మేనిఫెస్టోను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే మేనిఫెస్టోను ఫాలో అవుతున్నాడు. ఏపీ శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప. జగన్ అవునన్నదల్లా చంద్రబాబు కాదన్నాడు. జగన్ ఎస్ అంటే నో అన్నాడు..నో అంటే ఎస్ అన్నాడు. చంద్రబాబు మేనిఫెస్టోపై ఆయన పార్టీలోనూ చర్చ జరగడం లేదు. మేనిఫెస్టోలో చెప్పిందే జగన్ చేస్తున్నాడు. పేద ప్రజలను మోసం చేయడం లేదు. ఆయన వల్ల ఎవరూ దగాపడలేదు. అమరావతిలో పేదలకు ఇళ్లిస్తామంటే చంద్రబాబు చీదరించుకున్నాడు. పేదలు అమరావతిలో ఉండకూడదా? జనానికి ఉపయోగపడేలా రాజకీయం చేయాలి. పేదలకు వ్యతిరేకంగా భావజాలంతో ఉన్న వారిని తరిమికొట్టాలి

మళ్లీ జగనే సీఎం: మర్రి రాజశేఖర్‌
మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్‌ అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ పేర్కొ‍న్నారు. సీఎ జగన్‌  మేనిఫెస్టోకు ఒక విలువ తెచ్చారని ప్రశంసించారు. భారతదేశానికే ఆదర్శవంతమైన వైఎస్‌ జగన్‌.. చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పుంటే 2014లో సీఎం అయ్యుండేవారని అన్నారు. ఒక్కరూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రజలకు సేవలు అందేలా చేస్తున్న వ్యక్తి  వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన రావడం లేదని ఈ రాష్ట్రానికి మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top