ఇల్లు కాదు జైలే.. | Sakshi
Sakshi News home page

ఇల్లు కాదు జైలే..

Published Wed, Sep 13 2023 1:22 AM

ACB court clarification for Chandrababu on House Remand Petition - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తనను జైలులో కాకుండా హౌస్‌ రిమాండ్‌ (ఇంటి వద్ద)లో ఉంచాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. హౌస్‌ రిమాండ్‌కు సంబంధించి ఏ చట్టంలో కూడా ఎలాంటి నిర్దిష్ట ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. అందువల్ల హౌస్‌ రిమాండ్‌ విషయంపై విచారణ జరిపే పరిధి ఈ కోర్టుకు (ఏసీబీ కోర్టు) లేదని పేర్కొంది.

అంతేకాక హౌస్‌ రిమాండ్‌లో ఎందుకు ఉంచాలనేందుకు చంద్రబాబు సరైన కారణాలను తమ ముందుంచలేదని తెలిపింది. హౌస్‌ రిమాండ్‌ విషయంలో న్యాయస్థానాన్ని పిటిషనర్‌ ఒప్పించలేకపోయారని, భద్రత విషయంలో ఇంటి వద్ద కంటే జైలు వద్దే ఎక్కువ భద్రత ఉంటుందన్న అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు వ్యక్తం చేసింది. ప్రత్యేక భద్రతా దళం (ఎస్‌పీజీ) భద్రత ఉన్న వ్యక్తికి అదే స్థాయిలో ఇంటి వద్ద భద్రత కల్పించడం సాధ్యం కాకపోవచ్చునంది. చంద్రబాబు భద్రత కోసం జైలులో పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.

మాకేవీ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు
తనను జైలులో కాకుండా హౌస్‌ రిమాండ్‌లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మాజీ సీఎం చంద్రబాబు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం రోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు తన తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించింది. హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. కొట్టివేయటానికి కారణాలు ఏమిటో కూడా కోర్టు వివరించింది. ఈ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ తమకేమీ కారణాలు వివరించాల్సిన అవసరం లేదని పేర్కొనగా, కారణాలను వెల్లడించాల్సిన బాధ్యత తమపై ఉందని కోర్టు స్పష్టం చేసింది. హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌ తిరస్కరణకు కారణాలను వివరించింది. 

జ్యుడీషియల్, పోలీసు రిమాండ్‌ మాత్రమే ఉన్నాయి.. 
మాజీ సీఎం చంద్రబాబు కోరుతున్న హౌస్‌ రిమాండ్‌ అసాధారణ అభ్యర్థన అని సోమవారం వాదనల సందర్భంగా అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ ప్రస్తావన ఏ చట్టంలో కూడా లేదని, అందువల్ల హౌస్‌ రిమాండ్‌ మంజూరు చేయడానికి వీల్లేదని వాదించారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రత కంటే జైలులో ఇంకా ఎక్కువ భద్రత ఉందని వివరించారు.

జైలులో చంద్రబాబు భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. జైలులో చంద్రబాబు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని తెలిపారు. చట్టంలో కేవలం జ్యుడీషియల్‌ రిమాండ్, పోలీసు రిమాండ్‌ మాత్రమే ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ఏసీబీ కోర్టు తీర్పు సందర్భంగా ఈ వాదనలను పరిగణలోకి తీసుకుంది.

బెయిల్‌ పిటిషన్‌ అంటూ హల్‌చల్‌...
మాజీ సీఎం చంద్రబాబు తరఫున బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తున్నానంటూ ఏసీబీ కోర్టులో మంగళవారం ఓ న్యాయవాది హడావుడి సృష్టించారు. చంద్రబాబు తరఫున ఓ టీడీపీ కార్యకర్త పేరుతో తాను బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తున్నట్లు ఆ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని కోరారు. అయితే చంద్రబాబు వకాలత్‌ ఇవ్వకుండా ఆయన తరఫున ఎలా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తారని కోర్టులో ఉన్న న్యాయవాదులు చర్చించుకున్నారు.

ఆ న్యాయవాది తీరును గమనించిన న్యాయస్థానం ఈ విషయాన్ని చంద్రబాబు తరఫున గత మూడు రోజులుగా వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల దృష్టికి తెచ్చింది. చంద్రబాబు ఎలాంటి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదని వారు కోర్టుకు తెలియచేయడంతో ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది.

సుదీర్ఘ వాదనలు.. సందేహాల నివృత్తి తరువాతే తీర్పు
మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌పై ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను ఏసీబీ కోర్టు ఎంతో ఓపికగా విన్నది. దాదాపు మూడు గంటలకు పైగా చంద్రబాబు పిటిషన్‌పైనే విచారణ జరిపింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించేందుకు ఎంత సమయం తీసుకున్నా వారిని ఏ దశలోనూ కోర్టు నిలువరించలేదు. అటు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది వినిపించిన ప్రతీ వాదననూ సావధానంగా ఆలకించింది.

ఆయన కోర్టు దృష్టికి తెచ్చిన ప్రతీ తీర్పునూ నిశితంగా పరిశీలించింది. వాటి విషయంలో తనకున్న సందేహాలను సైతం ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. అలాగే సీఐడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలను సైతం అదే రీతిలో ఆలకించింది. సీఐడీ న్యాయవాదిని కూడా ప్రశ్నించి తన సందేహాలను ఏసీబీ కోర్టు నివృత్తి చేసుకుంది. చివరకు సీఐడీ న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ తీర్పును వెలువరించింది.

చంద్రబాబుకు హౌస్‌ రిమాండ్‌ ఎందుకు ఇవ్వడం లేదో కోర్టు హాలులోనే చాలా స్పష్టంగా వివరించింది. తమకేమీ కారణాలను చెప్పాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది గట్టిగా వ్యాఖ్యానించినా కూడా, తన బాధ్యత మేరకు కారణాలను వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేసింది.

గత మూడు రోజులుగా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నా, తీవ్రమైన పని భారం ఉన్నప్పటికీ అన్ని పిటిషన్లను ఏసీబీ కోర్టు చాలా ఓపికగా విచారించింది. ఎక్కడా కూడా ఎలాంటి తొందరపాటుకు ఆస్కారం లేకుండా విచారణ జరుపుతూ వస్తోంది. న్యాయవాదులతో, ఇతరులతో (చంద్రబాబుకు  చెందిన వ్యక్తులు) కోర్టు హాలు కిక్కిరిపోయినప్పటికీ ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా ఏసీబీ కోర్టు తన బాధ్యతలను నిర్వర్తించింది.   

Advertisement
Advertisement