పెద్దపల్లిరూరల్: ‘మా పాఠశాలకు వచ్చే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది.. చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు.. ఈవిషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు’ అని ఓ ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేవిషయాన్ని జడ్జి శ్రీనిక కోహిర్కర్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దబొంకూరులో గురువారం వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి హాజరయ్యారు. తొలుత జెడ్పీహైస్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు పరిశీలించారు. ఓ ఉపాధ్యాయురాలు.. తనకు ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యల గురించి జడ్జికి వివరించారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని అక్కడే ఉన్న సర్పంచ్ కల్వల తిరుపతి, ఇతర అధికారులకు జడ్జి సూచించారు.


