బొగ్గు మార్కెట్‌లో తీవ్రమైన పోటీ కోలిండియా నుంచి అనేక సవాళ్లు తక్కువ ధరకే బొగ్గు విక్రయిస్తున్న ఇతర సంస్థలు నాణ్యమైన బొగ్గుపై దృష్టి సారించి.. ఉత్పత్తి వ్యయం తగ్గిస్తేనే భవిష్యత్
గోదావరిఖని:
సింగరేణి సంస్థ దేశ బొగ్గు మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. పెరుగున్న ఉత్పత్తి వ్యయానికి తోడు డిమాండ్ తగ్గుతుండడం లాభాలపై ప్రభావం చూపుతోంది. కోలిండియా కన్నా సింగరేణి బొగ్గు ధర రెట్టింపు ఉండడంతో వినియోగదారులు అటువైపే దృష్టి సారిస్తున్నారు. తక్కువ వ్యయంతో అధిక ఉత్పత్తి చేసి నిలదొక్కుకునేందుకు సింగరేణి యత్నించాలంటున్నారు. సింగరేణిలో అత్యధికంగా 80శాతం బొగ్గును ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. గతంలోలాగా కాకుండా ప్రస్తుతం భూగర్భగనుల స్థానంలో ఓసీపీ లు ఏర్పాటు చేయడంతో గ్యాలరీలు తెరుచుకునే సమయంలో బొగ్గు మండి బూడిదశాతం పెరిగి నాణ్యతపై ప్రభావం చూపుతోంది. ఫైర్‌కోల్ ఎక్కువగా వస్తూ గ్రేడ్ విషయంలో తక్కువగా నమోదు అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
జీ–11, 12, 13 గ్రేడ్ ఉత్పత్తి ఎక్కువ
సింగరేణిలో ప్రధానంగా జీ–11, 12, 13 రకాల గ్రేడ్ బొగ్గు ఎక్కువ ఉత్పత్తి అవుతోంది. జీ–11 టన్నుకు రూ.4,088 ధరతో విక్రయిస్తోంది. ఇదే వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ రూ.2,491, కోలిండియా రూ. 1,605 ధరతో అమ్ముతున్నాయి. వాటితో పోల్చితే సింగరేణి బొగ్గు రెండు రెట్లు అధికంగా వినియోగ దారులు చెల్లించాల్సి వస్తోంది. అత్యధికంగా బొగ్గు వినియోగిస్తున్న ఎన్టీపీసీ ఇప్పటికే కోలిండియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటామని ప్రతిపాదన పెట్టింది. కేంద్రప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో సింగరేణి నుంచే బొగ్గు కొనుగోలు చేస్తోంది. ప్రైవేట్ సంస్థలు కోలిండియా వైపు దృష్టి సారిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఒప్పందాన్ని నిలబెట్టుకోలేక..
వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించడంతో సత్ఫలితాలు సాధించడం లేదని సింగరేణి పేర్కొంటోంది. కోలిండియా, కమర్షియల్ గనులు, ఇంపోర్టెడ్ కోల్ సరఫరాదారులు ఎలాంటి స్లిప్పేజీ లేకుండా బొగ్గు రవాణా చేస్తున్నాయి. సింగరేణి ప్రకటించిన గ్రేడ్ నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిద్వారా భారీగా ఆర్థికలోటు ఏర్పడుతోందని నిపుణులు అంటున్నారు. ఒకవైపు గ్రేడ్ ధర అధికంగా ఉండటం, మరోవైపు క్వాలిటీ తగ్గుతుండడం ఇబ్బందికరంగా మారుతోంది. త్వరలో ప్రారంభం కాబోయే ఎన్టీపీ సీ మూడు 800 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించిన బొగ్గు లింకేజీని వదులుకోవడానికి విద్యుత్ మంత్రిత్వశాఖను సంప్రదించింది.
సింగరేణి, ఇతర సంస్థలు విక్రయిస్తున్న బొగ్గుఽ ధర(టన్నుకు రూ.లలో)
గ్రేడ్ సింగరేణి వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ కోలిండియా
జీ–5 8,519 5,031 4,412
జీ–6 7,882 4,709 3,768
జీ–7 7,322 4,387 3,180
జీ–8 5,922 3,547 2,480
జీ–9 4,970 2,960 1,990
జీ–10 4,774 2,750 1,822
జీ–11 4,088 2,491 1,605
జీ–12 3,710 2,376 1,509
జీ–13 3,193 2,260 1,412
బొగ్గు నాణ్యతతోనే సింగరేణికి భవిష్యత్
నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితోనే సింగరేణికి భవిష్యత్ ఉంటుంది. ఇతర సంస్థలతో పోల్చితే ఇప్పటికే బొగ్గు మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉంది. కోలిండియాలోని ఇతర సంస్థలతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ ధరకు బొగ్గు విక్రయించాల్సి వస్తోంది. ఈక్రమంలో తక్కువ వ్యయంతో నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు అందించాల్సిన అవసరం సింగరేణీయులపై ఉంది. – బండి వెంకటయ్య, ఆర్జీ–2 జీఎం


