కనిపించని పులి జాడ
జూలపల్లి(పెద్దపల్లి): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు, ఆసక్తిని రేపుతుండగా, దాని జాడ కోసం అటవీశాఖ అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా జిల్లావ్యాప్తంగా గుట్టలు, చెట్లతో దట్టంగా నిండి ఉన్న ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లా అటవీ అధికారుల పులి సమాచారం సేకరించేందుకు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ రైతులను అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం మండలంలోని తేలుకుంట రామప్ప గుట్టలు, పెద్దాపూర్, అబ్బాపూర్లో గుట్టలు ఉన్న ప్రాంతాల్లో పరిశీలిస్తూ పులి సంచారంపై రైతులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజనల్ సెక్షన్ అధికారి మంగీలాల్ మాట్లాడుతూ, పులి సంచారంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా మండలంలో పులి సంచారంపై ఆకతాయిలు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులతో ప్రజలు, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సెల్‌ఫోన్లలో వస్తున్న పోస్టులను ఏవీ నమ్మాలో తెలియక ప్రజల్లో గందరగోళం నెలకొంది. నేటికీ పులిని ఎవరూ చూడకపోగా, బూటకపు పోస్టులు పెట్టడంపై మండల ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆకతాయిల పోస్టులతో భయాందోళనలో ప్రజలు


