వీటీడీఏని నడిపేదెవరు?
స్థానిక ఎన్నికలు వస్తే..
సీఈవో–వైస్ చైర్మన్, సెక్రటరీ పోస్టులు ఖాళీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇంకా కలెక్టర్‌ను కేటాయించని సర్కారు అడిషనల్ కలెక్టర్‌కే ఇన్‌చార్జి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు లోకల్ బాడీ ఎన్నికలొస్తే.. గుడి పనుల పర్యవేక్షణ కష్టమే..! ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సభ్యులైనా.. సిబ్బంది భర్తీ ఎన్నడో?
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పర్యవేక్షణ తగ్గుతోంది. వేములవాడ దేవస్థానాన్ని యాదగిరి గుట్ట తరహాలో అభివృద్ధి చేసేందుకు 2016లో వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీటీడీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి గతంలో తగినంత సిబ్బందిని కూడా కేటాయించింది. ఇటీవల వీటీడీఏ పర్యవేక్షణలో ఆలయ పునర్నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. అయితే కాలక్రమంలో ఈ బోర్డులో సిబ్బంది కరువవుతూ, వీటీడీఏ పరిధిలో జరిగే పలు అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కరువవుతోందన్న విమర్శలున్నాయి. వీటీడీఏలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎస్పీ, కలెక్టర్ తదితరులు సభ్యులుగా ఉన్నా.. సిబ్బందిని భర్తీ చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దాదాపు రూ.160కోట్లకు పైగా అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ అమలు, రోడ్ల విస్తరణ పనులు పూర్తి కావాలంటే.. బోర్డుకు సీఈవో–వైఎస్ చైర్మన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భక్తులు కోరుతున్నారు.
2016లో..
ఆలయ అభివృద్ధికి దిక్సూచి, దిశానిర్దేశం చేసేది వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీటీడీఏ). దీన్ని తెలంగాణ అర్బన్ డెవలప్‌మెంట్ యాక్ట్ 1975 ప్రకారం 2016లో వేములవాడ మండలంలోని నారాయణపేట గ్రామంతోపాటు తిప్పాపూర్, సంకేపల్లి, నాంపల్లి, చంద్రగిరి, మరుపాక, శాత్రాజ్‌పల్లి గ్రామాలను వీటీడీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటీడీఏ కోసం రూ.100 కోట్లు కూడా ఇస్తామని ప్రకటించారు. వీటీడీఏకి సిబ్బందిని కూడా కేటాయించారు.
కీలక పోస్టులన్నీ ఇన్‌చార్జులే..
వీటీడీఏకి ప్రారంభంలో రిటైర్డ్ ఐఐఎస్ పురోషోత్తంరెడ్డి సీఈవో–వైఎస్ చైర్మన్‌గా వ్యవహరించారు. గ తంలో భూసేకరణ, నిధులు, రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ తదితర పనులన్నీ ఆయన పర్యవేక్షణలోనే జరిగేవి. అనంతరం ఆయన ఆ పద వి నుంచి వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నారు. దీంతో పదవిని సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతగా అప్పగించారు. మొన్నటివరకు సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఈ బాధ్యతల ను నిర్వర్తించారు. ఆయన హయాంలో కీలకమైన రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనుల్లో రాజీలేకుండా వ్య వహరించారు. అయితే ఆకస్మికంగా ఆయన బదిలీ అవడంతో ఇపుడు ఈ పోస్టు ఖాళీగా ఉంది. సెక్రటరీగా ఆర్డీవో భుజంగరావు వ్యవహరించారు. అడిషనల్ కలెక్టర్ పదోన్నతి రావడంతో ఆయన సెక్రటరీ పోస్టు వీడారు. ఆయన సెక్రటరీ బాధ్యతలను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్(టీపీవో) అన్సారీకి అప్పగించారు. ఇపుడు కీలకమైన పోస్టులను ఇన్‌చార్జులకు అప్పగించడం వల్ల ఆలయ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు రూ.160కోట్ల విలువైన పనులను పర్యవేక్షించేందుకు సమర్థులైన పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారి కావాలని కోరుతున్నారు.
ఆలయ పరిసరాల్లో జరుగుతున్న విస్తరణ పనులు
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్ ఇంకా రాలేదు. ప్రస్తు తం అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే.. అసలే పూర్తిస్థాయి కలెక్టర్ లేక అదనపు బాధ్యతలు చూస్తున్న గరిమాకు గుడి అభివృద్ధి పనులను దాదాపు 2 నెలలపాటు చూసే తీరిక దొరికే అవకాశాలు చాలా తక్కువవుతాయి. దాదాపు రూ.168కోట్ల మేరకు జరుగుతున్న పనుల కోసం వివిధ విభాగాల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకునే ఉన్నతాధికారి అవసరం ఎంతైనా ఉందని, పూర్తిస్థాయి అధికారులను నియమించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. వీటీడీఏ సిబ్బంది విషయం ఇటీవల ప్రస్తావనకు వచ్చిందని, త్వరలోనే సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని వివరణ ఇచ్చారు.
పనులు నిధులు
గుడి కాంప్లెక్స్ విస్తరణ రూ.76కోట్లు
అన్నదాన సత్రం రూ.32కోట్లు
మూలవాగు వంతెన రోడ్డు వెడల్పు రూ.45కోట్లు
బద్దిపోచమ్మ గుడి ఆధునికీకరణ రూ.10కోట్లు
బీటీ రోడ్ల నిర్మాణం రూ.10కోట్లు
మొత్తం రూ.168కోట్లు
(దాదాపు)
కీలక పోస్టులు ఖాళీగా..
వీటీడీఏ సీఈవో–వైఎస్ చైర్మన్
(ఐఏఎస్ ర్యాంకు అధికారి): 01
సెక్రటరీ(ఆర్డీవో ర్యాంకు అధికారి): 01
చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్: 01
సీనియర్ అకౌంట్స్:01,
చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్:01
సూపరింటెండెంట్:01, డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
ప్రైవేట్ సెక్రటరీ: 01, అటెండర్: 04
డ్రైవర్: 01


