వణికిస్తున్న చలి
ఖనిలో చలిమంటులు కాగుతూ..
12.9 డిగ్రీల
సెల్సియకు పడిపోయిన
ఉష్ణోగ్రతలు
కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మూడు రోజులుగా చలి గాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున పొగమంచు కమ్మేసి రహదారులు కనిపించడంలేదు. సోమవారం జిల్లాలోని జూలపల్లిలో 12.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో ఉదయం పొలాలకు వెళ్లే రైతులు, పంట పనుల్లో నిమగ్నమయ్యే కూలీలు దుప్పట్లు, స్వెట్టర్లు, తలపాగాలు ధరించి చలిని తట్టుకుంటున్నారు. విద్యార్థులు వణుకుతూ బస్సులు, ఆటోల్లో స్కూళ్లకు చేరుతున్నారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఉదయం బయటకు వెళ్లొద్దు
పెద్దపల్లి: వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా వేకువజామున, రాత్రివేళల్లో బయట తిరిగ వద్దు. దుప్పట్లు, చెద్దర్లు, స్వెటర్లు ధరించాలి అంటున్నారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ వినయ్.
ఎలాంటి దుస్తులు ధరించాలి?
డాక్టర్ : చలికాలంలో ప్రతీఒక్కరు ఉన్ని దుస్తులు ధరించాలి. బయటకు వెళ్తే మాస్క్ తప్పకుండా ధరించాలి.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
డాక్టర్ : సి – విటమిన్ అధికంగా ఉండే నిమ్మ, దానిమ్మ, తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
ఆస్తమా, గుండెజబ్బులు ఉన్నవారు ఏం చేయాలి?
డాక్టర్ : రాత్రివేళ, వేకువజామున బయటకు వెళ్లొద్దు. తప్పనిసరిగా ఇన్‌హేలర్ వెంట ఉంచుకోవాలి.
ఎలాంటి నీరు తాగాలి?
డాక్టర్ : ప్యూరిఫైడ్ వాటర్‌తోపాటు వేడిచేసి కాచి చల్లార్చిన నీరు తాగాలి.
వృద్ధులు, పిల్లలపై చలి ఎలాంటి ప్రభావం చూపుతుది?
డాక్టర్ : పిల్లలు, వృద్ధులు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. నివారణ కోసం ముందుగానే పిల్లలకు టీకా వేయించాలి. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను తప్పకుండా సంప్రదించాలి.
వణికిస్తున్న చలి


