ఊపిరికి భరోసా
చివరిదశలో క్రిటికల్ కేర్ సెంటర్ పనులు రెండంతస్తులు.. 50 పడకల సామర్థ్యంతో నిర్మాణం రూ.23.75 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు జీజీహెచ్‌లో ప్రత్యేక భవనం
కోల్‌సిటీ(రామగుండం): అత్యవసర వైద్య సేవలకు ఊపిరి పోసేలా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చేపట్టిన క్రిటికల్ కేర్ సెంట ర్ త్వరలోనే అందుబాటుకి రానుంది. ఇందుకోసం సుమారు రూ.23.75 కోట్ల వ్యయంతో రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. భవన నిర్మాణ పనులు తుదిశకు చేరాయి. సెంటర్ అందుబాటులోకి వస్తే.. మనజిల్లావాసులతోపాటు పొరుగు జిల్లా ప్రజలకు కూడా అత్యవసర వైద్యసేవలు చేరువలోనే అత్యంత వేగంగా అందుతాయి.
అత్యాధునిక హంగులు..
జీ ప్లస్– 2తో అత్యాధునిక హంగులతో భవనం నిర్మిస్తున్నారు. భవనం కోసం రూ.10 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.13.75 కోట్లు వెచ్చిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పనులకు భూమిపూజ చేశారు.
50 పడకల సామర్థ్యం..
50 పడకల సామర్థ్యంతో భవనం నిర్మిస్తున్నారు. ప్రతీబెడ్ వద్ద ఆధునిక మానిటరింగ్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లైన్లు, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్, సర్జికల్ సపోర్ట్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలపాటు వైద్య సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తారు.
డీఎంఈకి సూపరింటెండెంట్ లేఖ..
కాంట్రాక్టర్ బిల్డింగ్‌ను అప్పగించేలా, వైద్య పరికరాలు తెప్పించేలా టీఎస్‌ఎంఐడీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 60 రకాల ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చాలంటూ ఈనెల ఒకటో తేదీన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాళ్‌సింగ్ ఓ లేఖ కూడా రాశారు.
కలెక్టర్ పర్యవేక్షణలో పనులు..
కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక పర్యవేక్షణతో క్రిటికల్ కేర్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం తరచూ అధికారులతోఆయన సమీక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు సత్వర సేవలు అంది ప్రాణనష్టం తగ్గుతుందని చెబుతున్నారు. ఈమేరకు పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లకు కలెక్టర్ సూచనలు చేస్తున్నారు.
ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్..
ఆధునిక పరికరాలతో కూడిన క్రిటికల్ కేర్ సెంటర్‌ను వేగంగా ఆధునికీకరిస్తున్నారు. దీనిద్వారా రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, ఊపిరితిత్తులు తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్ అందుతుంది.
ఆస్పత్రి సామర్థ్యానికి కొత్త శక్తి..
సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్ –ప్రభుత్వ)కు అనుబంధ గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి(బోధనాస్పత్రి) రాష్ట్రంలో అత్యధిక మంది పేషెంట్లకు సేవలు అందించే వాటిలో ఒకటి. క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభమైతే ఆస్పత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. పేషెంట్ల ప్రాణరక్షణలో ఇది అత్యంత కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు. జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఇప్పటికే కొత్త సదుపాయం కోసం సన్నద్ధమవుతున్నారు.
తుదిదశకు పనులు
ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తయ్యింది. విద్యుత్, ఆక్సిజన్ కనెక్షన్లు, అంతర్గత ఫర్నిషింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో అన్నిఏర్పాట్లు పూర్తి చేసి సెంటర్‌ను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
డీఎంఈకి లేఖ రాశాం
జీజీహెచ్‌లో చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనం పనులు చివరిదశలో ఉన్నాయి. వైద్య పరికరాల కోసం డీఎంఈకి లేఖ రాశాం. దీనిద్వారా ఎమర్జెన్సీ సేవలు మరింత బలోపేతం అవుతాయి. ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ రాజు, ఆర్‌ఎంవో, జీజీహెచ్
15 రోజుల్లో పనులు పూర్తి
క్రిటికల్ కేర్ సెంటర్ భవన నిర్మాణం మరో 15రోజుల్లో పూర్తికానున్నాయి. కాంట్రాక్టర్ భవనాన్ని అప్పగించాక.. మౌలిక సదుపాయాలతోపాటు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. పనులను తరచూ పర్యవేక్షిస్తున్నాం.
– విక్రమాదిత్య, ఏఈ, టీఎస్‌ఎంఐడీసీ
ఊపిరికి భరోసా
ఊపిరికి భరోసా


